Hyderabad Police Arrested Drugs Kingpin Edwin Nunes: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక ఘట్టం వెలుగు చూసింది. మోస్ట్ వాంటెడ్ అయిన డ్రగ్స్ కింగ్‌పిన్ ఎడ్విన్ న్యూన్స్‌ను గోవాలో అరెస్ట్ చేశారు. సంవత్సరం నుంచి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు.. ఇప్పటివరకూ కొందరు అంతర్జాతీయ డ్రగ్స్ సప్లయర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఎడ్విన్‌ని అరెస్ట్ చేసేందుకు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించిన అధికారులు.. ఎట్టకేలకు అతడ్ని పట్టుకోగలిగారు. ఎడ్విన్‌పై గోవాల్ నాలుగు, హైదరాబాద్‌లో మూడు కేసులు ఉన్నాయి. సోనాలి ఫోగట్ హత్య కేసులోనూ ఎడ్విన్ నిందితుడిగా ఉన్నాడు.
ఎడ్విన్‌కి 45 ఏళ్ల వయసు కాగా.. పది సంవత్సరాల నుంచి అతడు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. తొలుత గోవాలో ఒక రెస్టారెంట్‌లో వర్కర్‌గా పని చేసిన ఎడ్విన్.. ఆ తర్వాత డ్రగ్స్ నెట్‌వర్క్‌లో కీలకంగా మారాడు. క్రమంగా డ్రగ్స్ కింగ్‌పిన్‌గా అవతరించాడు. ఇతనికి 50 వేల మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. అందులో 600 మంది తెలంగాణకు చెందిన కస్టమర్స్ ఉన్నట్టు తేలింది. డ్రగ్స్ ద్వారా వందల కోట్లు డబ్బు సంపాదించిన ఇతను.. గోవాలో మూడు వీలాసవంతమైన ఇళ్లను నిర్మించుకున్నాడు. గోవాలో ఎడ్విన్ చెప్పిందే వేదం. గోవాలో అడుగుపెట్టారంటే.. కస్టమర్స్ అందరూ అతనికి చెందిన కర్లిస్ షాక్‌కు వెళ్లాల్సిందే! ముంబైకి చెందిన ఓ వ్యాపారి కుమార్తెను పెళ్లి చేసుకున్న ఇతగాడు.. గోవాలో పెద్ద మ్యూజిక్ పార్టీలను ఏర్పాటు చేసి, డ్రగ్స్‌ని విక్రయించేవాడు.
ఇప్పుడు ఎడ్విన్ అరెస్ట్ అవ్వడంతో.. గోవా పెద్దలు కొంచెం గాలి పీల్చుకుంటున్నారు. అతడ్ని అరెస్ట్ చేసినందుకు.. హైదరాబాద్ పోలీసులకు గోవా అధికారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎడ్విన్ అరెస్ట్ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. అతడ్ని అరెస్ట్ చేసేందుకు తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నామన్నారు. ఎడ్విన్‌ని తప్పించేందుకు చాలామంది పెద్దలు రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేశారన్నారు. గోవాలోని ఎడ్విన్ డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని తాము కూల్చివేశామని వెల్లడించారు.
