హైదరాబాద్ నగరంలో అక్రమంగా విక్రయిస్తున్న పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అధికారులు రట్టు చేశారు. నాంపల్లి, హబీబ్‌నగర్ పరిధిలోని మూడు కాస్మెటిక్ షాపులతో పాటు సంతోష్‌నగర్‌లోని మరో దుకాణంలో అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న గోరీ, చాందినీ, ఫైజ్, నావియా సహా 37 రకాల బ్రాండ్లకు చెందిన సుమారు రూ.7 లక్షల విలువైన పాకిస్థానీ కాస్మెటిక్స్ ఉత్పత్తులను సీజ్ చేశారు. సంతోష్‌నగర్ షాపునకు చెందిన గోడౌన్‌లో అదనంగా దాచి ఉంచిన స్టాక్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విషపూరిత హెవీ మెటల్స్.. ఆరోగ్యానికి తీవ్ర హానికరం
భారత్‌లో విక్రయించేందుకు అవసరమైన ఎలాంటి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్లు, అనుమతులు లేకుండానే ఈ ఉత్పత్తులను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు సీడీఎస్‌సీఓ అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా మార్కెట్లో విరివిగా విక్రయిస్తున్న స్కిన్ వైటెనింగ్ క్రీములు, సబ్బులలో పరిమితికి మించిన మోతాదులో ప్రమాదకర హెవీ మెటల్స్ ఉన్నట్లు అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ఇటువంటి కాస్మెటిక్స్ వాడటం వల్ల చర్మానికి తీవ్ర హాని కలగడమే కాకుండా, పౌరుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. స్థానిక షాపుల యజమానులు వినియోగదారుల కోరిక మేరకు ఎలాంటి బిల్లులు, ఇన్వాయిస్‌లు లేకుండానే వీటిని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
పాకిస్థాన్ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్.. ఐదుగురిపై కేసు నమోదు
ఈ కాస్మెటిక్స్ సరఫరా నెట్‌వర్క్ వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ నుండి సముద్ర మార్గాన ముంబైకి చేరుకుంటున్న ఈ సరుకును, అక్కడి డీలర్ల ద్వారా హైదరాబాద్‌లోని దుకాణాలకు అక్రమంగా చేరవేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిపై బిఎన్ఎస్ (BNS) 123, 318(4) సెక్షన్లతో పాటు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ సెక్షన్లు 18-C, 27-A కింద కేసులు నమోదు చేశారు. సరఫరా గొలుసులోని ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసు బృందాలు ముంబైకి పయనమయ్యాయి. బ్యాంకు లావాదేవీలు, రవాణా రికార్డులపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

