Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్

  • మెట్రో, ఆర్టీసీకి ఉమ్మడి పాస్‌లు
  • డైలీ పాస్ రూ.400.. నెలవారీ రూ.8,500
  • ‘మీ టికెట్’ యాప్‌తో డిజిటల్ టికెటింగ్
  • ఫోన్‌లోనే బస్ టికెట్లు, పాస్‌లు
Metro Rtc

Metro Rtc

హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం ప్రయాణించే పౌరులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగర ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఒకే పాస్‌తో ప్రయాణించేలా ‘కామన్ పాస్’ (ఉమ్మడి పాస్) విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త ఉమ్మడి పాస్ వ్యవస్థతో పాటు అప్‌గ్రేడ్ చేసిన ‘మీ టికెట్’ (MeeTicket) మొబైల్ యాప్‌ను రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఒకే పాస్‌తో రెండు ప్రధాన రవాణా వ్యవస్థల్లో ప్రయాణించే వెసులుబాటు కలగడంతో నగరవాసులకు ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా కానుంది.

రోజువారీ, నెలవారీ జాయింట్ పాస్ ధరలు ఖరారు

ఈ ఉమ్మడి పాస్ విధానంలో భాగంగా ఆర్టీసీ, మెట్రో సర్వీసులను అనుసంధానిస్తూ రోజువారీ , నెలవారీ పాస్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. రోజువారీ జాయింట్ పాస్ ధరను రూ. 400గా నిర్ణయించగా, నెలవారీ జాయింట్ పాస్ ధరను రూ. 8,500గా ఖరారు చేశారు. ఈ జాయింట్ పాస్ ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు , మెట్రో రైళ్లలో సులువుగా ప్రయాణించవచ్చు. నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం నగరం నలుమూలలకూ రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ పాస్‌లు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.

ఆర్టీసీలో ఆన్‌‌లైన్ డిజిటల్ టికెటింగ్.. ‘మీ టికెట్’ యాప్ ద్వారా సేవలు

నగర రవాణాలో మరో కీలక మార్పుగా ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కండక్టర్ ప్రమేయం లేకుండా, పేపర్ టికెట్ అవసరం లేకుండా ప్రయాణికులు తమ మొబైల్‌లోనే నేరుగా టికెట్ పొందేలా ఈ సదుపాయాన్ని రూపొందించారు. అప్‌గ్రేడ్ చేసిన ‘మీ టికెట్’ మొబైల్ యాప్ ద్వారా రోజువారీ టికెట్, డే పాస్‌‌లతో పాటు ఆర్టీసీ కొత్తగా తెచ్చిన వారం రోజుల పాస్ , నెలవారీ బస్ పాస్‌లను నేరుగా ఫోన్ నుంచే పొందే వెసులుబాటు కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయాణికులకు వేగవంతమైన, పారదర్శకమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సంస్కరణలు చేపట్టింది.