NTV Telugu Site icon

Hyderabad: మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రం. ప్రపంచంలోనే తొలిసారి!

Hyderabad Mosque

Hyderabad Mosque

Hyderabad: వైద్యుడు దేవుడితో సమానం అంటారు. మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని చెబుతారు. అసలు మతం కన్నా అభిమతం ముఖ్యమని కూడా అంటుంటారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. బహుశా ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని ఒక మసీదులో ఉచిత డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆ ప్రార్థనా మందిరం పేరు మస్జిద్-ఎ-మహమ్మదియా. అది లంగర్‌హౌజ్‌లో ఉంది.

అక్కడ కులమతాలకు అతీతంగా, ముఖ్యంగా పేదలకు ట్రీట్మెంట్‌ అందిస్తున్నారు. నెఫ్రాలజిస్ట్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ షోయబ్‌ అలీఖాన్‌ చీఫ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అక్కడ అందించే అన్ని వైద్య సేవలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌, SEED US అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ యూనిట్‌ని పూర్తి స్థాయి సౌకర్యాలతో ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంలో ఐదు లేటెస్ట్‌ ఫ్రెసెనియస్ బ్రాండ్‌ మెషీన్లు ఉన్నాయి.

read more: Taj Mahal: వహ్‌.. తాజ్‌. 144 కట్టడాల్లో టాప్‌లో నిలిచిన తాజ్‌మహల్‌.

ఇంకో ఐదు యంత్రాలను మరో మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యున్నత నాణ్యత కలిగిన అధునాతన వైద్య పరికరాలతో ఈ డయాలసిస్‌ సెంటర్‌ని ఒక కార్పొరేట్‌ హాస్పిటల్‌ రేంజ్‌లో ఏర్పాటు చేయటం విశేషం. ఇక్కడ డయాలసిస్‌ పేషెంట్లతోపాటు క్లినికల్‌ కేర్‌, ఎమర్జెన్సీ సర్వీసులను కూడా అందిస్తున్నారు. డాక్టర్‌ షోయబ్‌ అలీఖాన్‌తోపాటు ఒక మెడికల్‌ డాక్టర్‌, ఏఎన్‌ఎంలు, డయాలసిస్‌ టెక్నీషియన్లు, అంబులెన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంటే రోజుకు 12 గంటల పాటు వైద్యం అందిస్తున్నారు. ‘సకల సదుపాయాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి ప్రాథమికంగానే దాదాపు 45 లక్షల రూపాయల ఖర్చు అయింది. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ నెలకు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తోంది’ అని SEED USకి చెందిన మజ్‌ హుస్సైనీ అనే వ్యక్తి తెలిపారు.

ఉచిత డయాలసిస్‌ సేవల కోసం పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవాళ్లు 9603540864 నంబర్‌కి కాల్‌ చేయొచ్చని చెప్పారు. ఏ మతమైనా మంచి చేయమనే చెబుతోంది. అవసరంలో ఉన్నవాళ్లను ఆదుకోమనే సూచిస్తోంది. అందునా అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఇలా ఉచితంగా చికిత్స చేస్తుండటం నిజంగా అభినందించాల్సిన విషయం.

Show comments