హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు అందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నడిచే ఏసీ ‘పుష్పక్’ బస్సు చార్జీలను ఏకంగా 40 శాతం వరకు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నగరవాసులకు, ఐటీ ఉద్యోగులకు , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కోత విధించారు. ఈ తగ్గిన నూతన చార్జీలు అక్టోబర్ 7వ తేదీ నుంచి తక్షణమే అమలులోకి రానున్నాయి.
సగానికి పైగా తగ్గిన ప్రయాణ భారం
కొత్తగా సవరించిన ధరల ప్రకారం, నగరంలోని ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం లభించనుంది. మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటివరకు ఉన్న రూ. 350 చార్జీని రూ. 250కి తగ్గించగా, జేఎన్‌టీయూ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ. 350గా ఉన్న రుసుమును రూ. 200కి కుదించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్ మార్గంలో చార్జీని రూ. 300 నుంచి ఏకంగా రూ. 150కి తగ్గించి సగానికి సగం భారాన్ని తగ్గించారు. అలాగే సికింద్రాబాద్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ. 350గా ఉన్న చార్జీ ఇకపై రూ. 200 మాత్రమే కానుంది. వీటితో పాటు లింగంపల్లి, ఆల్విన్ ఎక్స్‌రోడ్, కొండాపూర్ వంటి ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సు చార్జీలను కూడా మార్గాన్ని బట్టి రూ. 150 నుంచి రూ. 200 వరకు తగ్గించారు.
సుఖవంతమైన ఏసీ ప్రయాణం.. క్యాబ్‌ల కంటే తక్కువ ధరలోనే
సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ క్యాబ్‌లు, టాక్సీలను ఆశ్రయించి వేల రూపాయిలు వెచ్చించే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగిస్తుంది. అత్యంత సౌకర్యవంతమైన ఏసీ పుష్పక్ బస్సుల్లో ఇప్పుడు చాలా తక్కువ ధరలోనే సురక్షితంగా విమానాశ్రయానికి చేరుకునే వెసులుబాటు లభించింది. నగరం నుంచి శంషాబాద్ వెళ్లే ప్రయాణికులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

