High Court Advocate Arun Kumar Gives Clarity On Why PD Act Filed On Raja Singh: గోషామహల్ రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి, జైలుకు తరలించారని హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. పదే పదే ఒకే తరహా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తారని ఆయన అన్నారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తే.. ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ప్రివెంటివ్ డిటెన్షన్‌లో భాగంగానే జైల్లో పెడతారన్నారు. ప్రభుత్వానికి ఉన్న విచక్షణ అధికారంతో.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తర్వాత పీడీ యాక్ట్ జీవో తీసుకొచ్చిందని చెప్పారు. పీడీ యాక్ట్ నమోదు చేశాక.. ఆ వ్యక్తిని నేరుగా జైలుకి తరలించే అధికారం పోలీసులకు ఉంటుందని వెల్లడించారు. ఈ పీడీ యాక్ట్‌ను సవాల్ చేయాలంటే.. పీడీ యాక్ట్ రివోక్ కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక శాసన సభ్యుడుపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి అని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
అంతకుముందు రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు.. తరచూ మత ఘర్షణలు చోటు చేసుకునేలా ప్రసంగాలు చేయడం వల్ల పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందని స్పష్టతనిచ్చారు. 22వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో రాజా సింగ్ ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వీడియో కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని.. ఈ కేసులో రాజాసింగ్‌ను అదుపులోకి ఈనెల 23న అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని.. తద్వారా ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారన్నారు. వ్యాపార సముదాయాలు సైతం మూతపడ్డాయని తెలిపారు. 2004 నుండి ఇప్పటివరకు రాజా సింగ్‌పై 101 పైగా క్రిమినల్ కేసులు, 18 కమ్యూనల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కాగా.. ఈ ఏడాదిలో నమోదైన రెండు కేసుల విషయంలో పోలీసులు రాజా సింగ్‌కు నోటీసులు పంపించడం, ఆయన్ను అరెస్ట్ చేయడం, చర్లపల్లి జైలుకి తరలించడం అంతా తెలిసిందే!
