NTV Telugu Site icon

Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్‌ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..

Vemulawada

Vemulawada

Rajanna Temple: వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మొదటి రోజు శుక్రవారం శివనామస్మరణతో పట్టణం మార్మోగింది. స్వామివారి గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను రద్దు చేశారు. ఇవాళ, రేపు (శని,ఆదివారాల్లో) భక్తులందరికీ లఘు దర్శనమే కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న (శుక్రవారం) వేములవాడ శ్రీ పార్వతీరాజరాజేశ్వరస్వామి గుడి చెరువు వేదిక వద్ద దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శివార్చన వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్‌, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి ఇవాళ శ్రీ పార్వతీరాజరాజేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వెల్లివిరియాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

హెలికాప్టర్‌ సేవలు..

కాగా.. మహాశివరాత్రి జాతర కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు హెలికాప్టర్‌ సేవలను అందుబాటులో ఉంచారు. నేరుగా రాజన్న ఆలయ చెరువు ప్రాంతంలో దిగేందుకు ఏర్పాట్లు చేశారు. 400 వసతి గదులు మాత్రమే ఉండడంతో గుడిచెరువు నేలంతా పందిళ్లతో నిండిపోయింది. తాగునీటి వసతితో పాటు స్నాన ఘాట్‌లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి జాగరణ చేసే భక్తులకు శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి కళాకారులు తరలివచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇతర జిల్లాలకు చెందిన మున్సిపల్ కార్మికులు, తాత్కాలిక కార్మికులు ఆలయ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు.  నిన్న (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం 4 లక్షల లడ్డూలు, 10 క్వింటాళ్ల పులిహారను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Read also:  Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

100 గ్రాముల లడ్డూలు, 250 గ్రాముల పులిహార ప్యాకెట్లు ఉంటాయి. 100 గ్రాముల లడ్డూ రూ.20, 500 గ్రాముల లడ్డూ రూ.100, పులిహార రూ. 15కి విక్రయిస్తారు. ప్రసాదం కౌంటర్లలోనే కాకుండా నిష్క్రమణ మార్గాల్లో కూడా అందుబాటులో ఉంచబడుతుంది. భక్తులకు వైద్య సహాయం అందించేందుకు 11 ఎమర్జెన్సీ సెంటర్లు, 163 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు డీఎంహెచ్‌ఓ డా. సుమన్ మోహన్ రావు అన్నారు. జాతర జరిగే ప్రాంతాలైన తిప్పాపూర్, జగిత్యాల బస్టాండ్ ప్రాంతాలు, నాంపల్లిగుట్ట, అమ్మవారి కాంప్లెక్స్, రాజేశ్వరపురం, ప్రధాన ఆలయం ఎదురుగా, భీమేశ్వరాలయం వద్ద, సంస్కృత కళాశాలల్లో అత్యవసర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడకు వెళ్లే అన్ని రహదారుల్లో అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు అంబులెన్స్‌లు, రెండు రెస్క్యూ టీమ్‌లను అందుబాటులో ఉంచారు.

మహా శివరాత్రి పూజలు..

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 18వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వేములవాడ పట్టణ వాసులకు సర్వదర్శనం, తెల్లవారుజామున 3.30 నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి చేయనున్నారు. 4 గంటల నుంచి 4.25 వరకు సుప్రభాతం, 4.25 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాత:కాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం, ఉదయం 7 గంటల నుంచి టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం, 8 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టువస్త్రాల సమర్పణ, సాయంత్రం 4 గంటల నుంచి శివుని దర్శనం, సాయంత్రం 6.05 నిమిషాలకు శ్రీ స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తారు. లింగోద్భవ కాలంలో 11.35 నిమిషాలకు శ్రీ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
Maha Shivaratri 2023 Celebrations Live: మహా శివరాత్రి శుభవేళ ప్రసిద్ధ క్షేత్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం

Show comments