Heavy Rains In Hyderabad City: కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకున్న వరుణుడు.. మరోసారి విజృంభించాడు. హైదరాబాద్ నగరంలో తాండవం చేశాడు. బంజారాహిల్స్, లక్డికపూల్, అసెంబ్లీ, సచివాలయం, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, మాధాపూర్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, గోషామహల్, అబిడ్స్, సుల్తాన్ బజార్, అంబర్పేట్, బషీర్‌బాగ్, అఫ్జల్ గంజ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ, మెహదీపట్నం, కార్వాన్, మాసబ్ ట్యాంక్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో వరుణుడు చెలరేగిపోయాడు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, జోరుగా వాన కురడంతో.. నగర ప్రజలు చల్లబడ్డారు. దీంతో.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ దెబ్బకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే ఇది ఉద్యోగుల సమయం కావడంతో.. చాలా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ నగరవాసులకు సలహా ఇచ్చారు. నగరవ్యాప్తంగా భారీ ట్రాఫిక్ జామ్ ఉండటంతో.. రెండు గంటల పాటు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయని, రాత్రి 9 గంటలవరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకవేళ తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోకపోతే, సీరియస్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ వర్షానికి సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు అందించాల్సిందిగా టీవీ ఛానెల్స్‌ని కోరారు.
ఇదివరకే కురిసిన భారీ వర్షాల కారణంగా.. తెలంగాణలో ఎన్నో సమస్యలు తలెత్తాయి. వరదలు పోటెత్తడంతో ప్రాజెక్టులన్నీ నిండకుండల్లా తయారయ్యాయి. తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా.. కడెం ప్రాజెక్ట్, భద్రాచలంలోని గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో.. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించారు. అయితే.. కొన్ని రోజుల వానలు లేకపోవడం, వరద ఉదృతి తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇంతలోనే హైదరాబాద్‌లో భారీ వర్షాలు దంచికొట్టాయి. దీంతో.. అధికారులు అప్రమత్తయ్యాయి. ప్రమాదాలు సంభవించకుండా, తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు.
