NTV Telugu Site icon

MLC Kavitha: నేడు సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తాజాగా ఈ కేసులో బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి, మార్చి 16న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు విడతలుగా 10 రోజుల పాటు ఆమెను విచారించారు. ఆ తర్వాత కవితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలో సీబీఐ జోక్యం చేసుకుని కవిత తిహార్ జైలులో ఉండగానే ఆమెను అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టును ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, జైలులో ఉంటే మరింత ఇబ్బందిగా మారతాయని కవిత పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. అయితే అరెస్టయినప్పటి నుంచి కవిత బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెయిల్ మంజూరు చేయాలని కవిత తరఫు లాయర్లు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో పలుమార్లు పిటిషన్ వేయగా… కోర్టు దానిని ధిక్కరించడం పరిపాటిగా మారింది. దీంతో కవిత గత 5 నెలలకు పైగా జైలులోనే ఉంది. మరోసారి బెయిల్ పిటిషన్‌లో కీలకమైన అంశాన్ని చేర్చి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. 60 రోజుల గడువులోగా పూర్తి ఛార్జిషీటు దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైందని కవిత తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ కోర్టు ఈ పిటిషన్‌ను విచారించి మరోసారి వాయిదా వేసింది. దీంతో కవిత కొంతకాలం జైలులోనే ఉండాల్సి వచ్చింది. మరి ఇవాళ కవిత బెయిల్ పై విడుదల అవుతారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Jaganmatha Stotram: శ్రావణ మంగళవారం జగన్మాత స్తోత్రాలు వింటే 100 రెట్ల ఫలితాన్ని పొందుతారు

Show comments