NTV Telugu Site icon

Head Constable: గ్రామస్థులపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం.. కారుతో ఈడ్చుకెళ్లి..

Telangana Police

Telangana Police

Head Constable: యువకుడిని అనవసరంగా ప్రశ్నించేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలపై హెడ్ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ దారుణాన్ని ప్రశ్నించిన మరో వ్యక్తిపై ఓ హెడ్ కానిస్టేబుల్ కారుతో దూసుకెళ్ళిన తీరుపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. కారు బానెట్‌పై పడి 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన తీరుపై మండిపడుతున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు కానిస్టేబుల్ చంపేస్తానని బెదిరించాడని స్థానికులు చెప్పిన తీరుపై మండిపడుతున్నారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో చోటుచేసుకుంది.

ముచ్చింతల్ గ్రామానికి చెందిన ధార కృష్ణ, బాలమణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా జనేశ్వర్ తన ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులను దుర్భాషలాడుతూ గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్, అతని కుమారుడు వంశీ తన పొలానికి వెళ్తున్న ధర కృష్ణ కుమారుడు పవన్ కుమార్‌తో అకారణంగా గొడవ పడ్డారు. పవన్ ను ఇష్టానుసారంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. పవన్ తల్లి బాలామణి, సోదరి రూప హెడ్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్.. బాలమణి, రూపపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలమణి బంధువు రాజుతోపాటు పలువురు గ్రామస్తులు వెళ్లి జ్ఞానేశ్వర్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్ తన కారును స్టార్ట్ చేసి అతి వేగంతో వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ జ్ణానేశ్వర్ కారుకు అడ్డుపడ్డ పవన్ బాబాయ్ పై కూడా కారును నడిపాడు. గ్రామస్థులు పరుగులు తీయగా, రాజు కారు బానెట్‌పై పడిపోయాడు. కనికరం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ అతడిని 200 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని బెదిరించాడు. హెడ్ కానిస్టేబుల్ దాడిలో గాయపడిన పవన్, బాలమణి, రూప, రాజులను గ్రామస్తులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎన్ టీవీతో బాధితుడు పవన్ మాట్లాడుతూ.. ముచ్చింతల్ గ్రామంలో మేము ఒక్కరమే కుటుంబానికి సంబంధించిన వాళ్ళమని అన్నాడు. దీంతో జ్ణానేశ్వర్ తరుచు కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజుల క్రితం తనను ఇంటికి పిలిచి తన పై జ్ణానేశ్వర్, అతని కొడుకు దాడి చేశారని అన్నాడు.
అడ్డుకోబోయిన తన బాబాయ్ ని కారు బ్యానెట్ పై పడటంతో అలాగే తీసుకెళ్ళాడని కన్నీరుపెట్టుకున్నాడు. కేవలం కులం పేరుతోనే తమపై దాడి చేశాడని పవన్ వాపోయాడు. గ్రామ పెద్దలు కూడా జ్ణానేశ్వర్ కానిస్టేబుల్ అని, అతని జోలికి వెళ్ళొద్దని చెబుతున్నారని అన్నాడు. మాకు న్యాయం కావాలి, కానిస్టేబుల్ జ్ణానేశ్వర్ అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారి వల్ల తెలంగాణ పోలీసుల ప్రతిష్ట దిగజారిపోతోందని వాపోయారు. ఓ వ్యక్తిని కారు బానెట్‌కు లాక్కెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Mass Strike: ఈ లిరిక్స్ కే పిచ్చెక్కి పోయేలా ఉన్నారు…

Show comments