రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం, లింగారెడ్డి గూడలో 100 పడకల ఆస్పత్రికి మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ రాకుంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యేవాడా, రేవంత్ చీఫ్ అయ్యేవాడా… జీవితాంతం వాళ్ళు కేసీఆర్ కు రుణపడి ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు చివరి వరకు తెలంగాణ రాకుండా పని చేశాయని, ఇవ్వకుండా సతాయించాయని ఆయన ఆరోపించారు. అధికార యావ తప్ప ఒక్కడూ తెలంగాణకు ఏం కావాలో మాట్లాడరు.. గద్వాలలో పాదయాత్ర చేస్తుంటే నీకు కర్ణాటక నుంచి వచ్చి దరఖాస్తు ఇస్తున్నారు.
రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు మా దగ్గర అమలు చేయాలని, లేకుంటే తెలంగాణలో కలపాలని అన్నారు.. బండి సంజయ్ కాదు తొండి సంజయ్.. బీజేపీ అంటే.. భారతీయ జూటా పార్టీ.. బడా జూటా పార్టీ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకులు కేసీఆర్ అని, దక్షిణాది రాష్ట్రాల్లో జీఎస్‌డీపీలో నెంబర్ వన్ గా నిలిచామన్నారు. కేసీఆర్ రైతులకు ఫ్రీ కరెంటు ఇచ్చినట్టు దేశంలో ఏ బీజేపీ ప్రభుత్వమైనా ఫ్రీ కరెంటు ఇస్తున్నదా.. బండి సంజయ్ సమాధానం చెప్పు అని నిలదీశారు హరీష్ రావు.
