NTV Telugu Site icon

Minister Harish Rao: కిషన్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఎక్కడికైనా వస్తా, తేల్చుకుందామా?

Harish Rao Challenges Kisha

Harish Rao Challenges Kisha

Harish Rao Challenges Kishan Reddy Over Central Govt Funds: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చింది ఎంత? రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది ఎంత? అనే విషయంలో కిషన్ రెడ్డి సోయి ఉండి మాట్లాడతాడా? లేదా? అన్నది తెలియట్లేదని ఎద్దేవా చేశారు. నిధుల విషయం తేల్చుకునేందుకు.. కిషన్ రెడ్డితో చర్చల కోసం ఎక్కడికైనా వస్తానని ఛాలెంజ్ చేశారు. కేంద్రానికి తామే రూ. 30 వేల కోట్లు జీఎస్టీ ఇచ్చామని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది మాత్రం కేవలం రూ. 8 వేల కోట్లేనని చెప్పారు. కేంద్రం 42 శాతం నిధులు ఇచ్చామని చెప్తోందని.. కానీ ఇచ్చింది 29 శాతం మాత్రమేనని తెలిపారు. కొన్ని పథకాలను సైతం రద్దు చేసి.. వేల కోట్ల రాష్ట్ర వాటాను తగ్గించారన్నారు.

ఇక ఈడీ, ఐటీలు బీజేపీ విడిచిన బాణాలని.. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో అవి ముందే వస్తాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా, తమని ఎన్ని ఇబ్బంది పెట్టినా.. భయపడమని తేల్చి చెప్పారు. బండి సంజయ్ మాటలకైతే తలా, తోక లేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. నెలకు లక్ష కోట్లు అప్పు తెస్తోందన్నారు. గడిచిన ఆరు నెలల్లోనే రూ. 1 కోటి కోట్ల అప్పులు తెచ్చారన్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా సీఎం కేసీఆర్ వల్లే అయ్యిందని.. ఈనెల 7వ తేదీన జగిత్యాలకు సీఎం వస్తారని తెలిపారు. నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయం, మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీశ్ రావు తెలిపారు.

అంతకుముందు.. తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయన్న హరీశ్ రావు, డబుల్ ఇంజిన్ సర్కారున్న రాష్ట్రాలు మాత్రం వెనక బడ్డాయని అన్నారు. అతి తక్కువ ఎంఎంఆర్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. అలాగే.. ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి ‘కంటి వెలుగు) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు.