దళితులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా స్థిరపడాలని, పారదర్శకంగా దళిత బంధును అందజేస్తున్నామన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప పథకం దళితబంధు అని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ముందుకు వెళ్తుందని, దళిత బంధు కోసం బడ్జెట్లో 17800 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. దళిత బంధుతో దళితులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా ఎదగాలని మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన దళిత బంధు కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా దళిత బంధు అందిస్తున్నామన్నారు. అధికారులు సూచనలు మాత్రమే చేస్తున్నారని, లబ్ధిదారులు వారికి వచ్చిన పని ,నచ్చిన పని చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ముందుకు వెళుతుందన్నారు. దళిత బందు కింద 10 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన దళిత బందుతో మరింత ఉన్నతంగా ఎదిగి సీఎం కోరుకున్న కలను నిజం చేయాలని లబ్ధిదారులకు సూచించారు.