Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!

  • స్పీడ్ పోస్టుతో 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా
  • 'డాక్టర్ రాహుల్' పేరుతో సిండికేట్ నిర్వహణ
  • నెలకు రూ.50 లక్షల గంజాయి వ్యాపారం
  • హెచ్-న్యూ పోలీసుల వలలో ప్రధాన నిందితుడు
Ganja

Ganja

Ganja Racket : దేశవ్యాప్తంగా సాగుతున్న ఒక భారీ గంజాయి సరఫరా సిండికేట్ నెట్‌వర్క్‌ను హెచ్ న్యూ (H-NEW) పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గుడిమల్కాపూర్ పోలీసుల సహాయంతో జార్ఖండ్‌కు చెందిన రాహుల్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుడు ‘డాక్టర్ రాహుల్’ అనే పేరుతో, కేవలం మందులు (మెడిసిన్స్) పంపిస్తున్నామంటూ నమ్మిస్తూ జార్ఖండ్ నుండి స్పీడ్ పోస్ట్ ద్వారా అత్యంత చాకచక్యంగా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పీడ్ పోస్ట్ పార్సిళ్లు కావడం వల్ల విమానాశ్రయాల్లోని అధికారులు పెద్దగా తనిఖీలు చేయకుండా వదిలేయడాన్ని ఆసరాగా చేసుకుని, ఏకంగా విమానాల ద్వారానే తెలంగాణ సహా దేశంలోని 21 రాష్ట్రాలకు ఈ ముఠా డ్రగ్స్ రవాణా సాగించింది.

ఈ నిందితుడు 21 రాష్ట్రాల్లో ఉన్న తన గంజాయి వినియోగదారులకు నేరుగా హోమ్ డెలివరీ (డోర్ డెలివరీ) సౌకర్యాన్ని కూడా కల్పించడం గమనార్హం. ఒక్క ముంబై నగరంలోనే రోజువారీగా దాదాపు 1000 మంది కస్టమర్లకు ఈయన నిరంతరాయంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వినూత్న పోస్టల్ సరఫరా పద్ధతి ద్వారా నిందితుడు ప్రతి నెలా దాదాపు అరకోటి (రూ. 50 లక్షలు) రూపాయల విలువైన గంజాయిని విక్రయిస్తూ భారీగా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ ముఠా వెనుక ఉన్న మిగిలిన లింకులపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు.