H NEW DCP Chakravarthy Reveals Arrest Details Of John Stephen Dsouza: గోవా కేంద్రంగా తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే! ఆ వివరాలను తాజాగా హెచ్-న్యూ డీసీపీ చక్రవర్తి మీడియాతో పంచుకున్నారు. ఆగస్టు 16వ తేదీన తాము బాబు అలియాస్ కాళీ అనే వ్యక్తిని ఈ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ చేశామని.. అతడు ఇచ్చిన సమాచారంతోనే తాము ఇన్వెస్టిగేషన్ చేశామని స్పష్టం చేశారు. కాళీని అరెస్ట్ చేశాక అతడు ఏడు మంది పేర్లు చెప్పాడని, ఆ వివరాలతోనే గోవా వెళ్లి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. గోవా పోలీసుల సహకారంతో తాము జాన్ స్టీఫెన్ డిసౌజాను అరెస్ట్ చేశామన్నారు. అతడి లిస్ట్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 600 మంది పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు.
డ్రగ్స్ కింగ్‌పిన్‌గా పేరొందిన జాన్ స్టీఫెవ్ డిసౌజా గోవాలో డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడని, హిల్ టాప్ రెస్టారెంట్‌లో డ్రగ్స్ డెన్ ఉందని డీసీపీ చక్రవర్తి వెల్లడించారు. 1983 నుండి ఆ రెస్టారెంట్ నడిపిస్తున్నారని.. ప్రతీ శుక్రవారం స్పెషల్ పార్టీలు జరుగుతాయన్నారు. ట్రాన్స్ మ్యూజిక్, టెక్నో మ్యూజిక్ పేర్లతో ఆ పార్టీలు ఏర్పాటు చేస్తారన్నారు. అక్కడికి వచ్చే టూరిస్టులు డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని సేవిస్తుంటారని తమ విచారణలో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. స్టీవ్ ఏజెంట్లు ఈ డ్రగ్స్‌ను అమ్ముతుంటారని.. మొత్తం 168 మంది హైదరాబాద్‌కి చెందిన కస్టమర్లు ఉన్నారని తాము గుర్తించామన్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్టీవ్‌ను హైదరాబాద్‌కి తీసుకొచ్చి విచారిస్తున్నామని.. కోర్ట్ అనుమతితో కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతామని డీసీపీ చక్రవర్తి చెప్పుకొచ్చారు. కాగా.. ఆరుగురు సభ్యులతో కలిసి హెచ్‌న్యూ – ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు సీక్రెట్‌గా జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, ఈ డ్రగ్స్ కింగ్‌పిన్‌ని గోవాలో అరెస్ట్ చేశారు. ఇతను సోనాలీ ఫొగట్ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడని సమాచారం.
