Governor Tamilisai Pressmeet On Pending Bills Issue: పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివాదంపై బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని, వాటిని పరిశీలిస్తున్నానని ఆమె చెప్పారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే తాను సమయం తీసుకున్నానని, ఆ బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఖాళీల విషయమై సమగ్ర నివేదికను తాను ప్రభుత్వానికి ఇచ్చానని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని తాను ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తున్నానని.. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టతనిచ్చారు.
కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ బిల్లు పై మంత్రి ఎప్పుడైనా రావొచ్చు… వివరణ ఇవ్వొచ్చు. ఒక నెల ఆలస్యం అయిందని రాజ్ భవన్ ముట్టడి చేస్తామని అంటున్న సంఘాలు… ఈ 8 ఏళ్లు ఆలస్యం అయినందుకు ప్రగతి భవన్ ముందు ఎందుకు చేయలేదన్నారు గవర్నర్ తమిళిసై. తాను ఎలాంటి బిల్లులను ఆపలేదని, బిల్లుల్ని తొక్కిపెట్టాననడం సబబు కాదని గవర్నర్ అన్నారు. కొత్త విధానంపై తనకు సందేహాలుండటంతో.. వాటిని పరిశీలిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. వీసీ పోస్టులు సైతం చాలా రోజులుగా ఖాళీగానే ఉన్నాయని, తాను డిమాండ్ చేశాకే వీసీలను నియమించారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా వీసీలను నియమించనప్పుడు ఆందోళన చెందని ఐకాస.. ఇప్పుడు తన వద్ద నెల రోజులు ఆగిపోగానే ఎందుకింత ఆదోళన చేస్తోందని నిలదీశారు. తాను మొదటగా నియామకాల బిల్లుకే ప్రాధాన్యం ఇచ్చానని.. ఒకదాని తర్వాత మరొక బిల్లుని పరిశీలిస్తున్నానని.. బిల్లులు పంపిన వెంటనే వాటిని ఆమోదించడం మాత్రమే తన విధి కాదని పేర్కొన్నారు. తాను ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నానని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని గవర్నర్ వెల్లడించారు.
ఇదే సమయంలో ప్రోటోకాల్స్ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై మండిపడ్డారు. తన పర్యటనలకు సంబంధించి తాను ముందుగానే పూర్తి వివరాల్ని సంబంధిత అధికారులకు పంపుతానని.. గతంలో తన పర్యటనల్లో ప్రొటోకాల్ పాటించని వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం రాజ్‌భవన్ గౌరవాన్ని దిగజార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఉన్నా.. రాజ్‌భవన్‌కు వెళ్లి నిరసన తెలపాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. విజ్ఞప్తులు వినేందుకు రాజ్‌భవన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని గవర్నర్ తమిళిసై చెప్పారు. నా ఫోన్ టాపింగ్ అవుతున్నట్టు అనుమానాలు ఉన్నాయన్నారు తమిళి సై.
