జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విధానాన్ని తీసుకురావడం కాదు.. దానిని ఆచరించాలని ఆమె సూచించారు. విద్య ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదని.. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్దికి విద్య అనేది ఎంతో అవసరమన్నారు. ‘ఉన్నత విద్యపై జాతీయ విద్యా విధానం-2022 యొక్క ప్రభావాలు’ అనే అంశంపై హైదరాబాద్ హైటెక్స్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ఆమె ప్రసంగించారు.
చదువును మధ్యలో ఆపేవాళ్లను చాలావరకు తగ్గించగలిగామని గవర్నర్ వెల్లడించారు. కానీ ఉన్నత విద్యను మధ్యలో వదిలేసే వారిని తగ్గించలేకపోతున్నామని తెలిపారు. చదివిన విద్యకు సంబంధించి ఉపాధి కల్పించలేకపోతున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ జాతీయ విద్యావిధానం వల్ల లింగ సమానత్వం పెరుగుతుందని.. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు వస్తున్నాయని ఆమె వెల్లడించారు. కేవలం డిగ్రీలే కాకుండా.. వారికి ఉపాధి కల్పించాలన్నారు. కొత్త విద్యా విధానం వల్ల ఇతర భాషలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
