Site icon NTV Telugu

Gangula Kamalakar: ఈడీ, ఐటీ సోదాలకు కారణం ఇదే!

Gangula On Ed Raids

Gangula On Ed Raids

Gangula Kamalakar Reacts On ED IT Raids: తనపై, తన వ్యాపారాలపై జరిగిన ఈడీ, ఐటీ సోదాల మీద మంత్రి గంగులా కమలాకర్ తాజాగా స్పందించారు. 30 ఏళ్లకు పైగా తాను, తన బంధువులు గ్రానైట్ వ్యాపారంలో ఉన్నామని.. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఇప్పటివరకూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు. తనపై, తన వ్యాపారాలపై ఈడీ, ఐటీకి చాలామంది ఫిర్యాదులు చేశారని.. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగాయని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలనే ఉద్దేశ్యంతోనే తాను దుబాయ్ వెళ్లిన 16 గంటల్లోనే తిరిగొచ్చానని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ, ఐటీ దాడులు జరిపించారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక తన ఫోన్‌ని తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందేమోనని గవర్నర్ తమిళిసై వ్యక్తం చేసిన అనుమానాల్ని మంత్రి ఖండించారు. ఆమె ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేవలం పేదల సంక్షేమం, వారి అభివృద్ధిపైనే దృష్టి ఉందని వెల్లడించారు.

కాగా.. మంత్రి గంగులా కమలాకర్ తన కుటుంబ సభ్యులతో దుబాయ్ పర్యటనలో ఉండగా, ఇంటి తాళాలు పగులగొట్టి మరీ ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. ఆయన కార్యాలయాలతో పాటు పలు వ్యాపార సంస్థలపై ఏకకాలంలో ఐటీ అధికారులు, ఈడీ అధికారులు దాడులు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటాయించిన మైన్లలో అనుమతికి మించి మైనింగ్ చేపట్టారన్న పిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. విదేశాలకు గ్రానైట్ ఎగుమతులకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఆదాయపన్ను ఎగవేతలపై కూడా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. మంత్రి సోదరుడు గంగుల వెంకన్న ఇంట్లో సైతం సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వీరందరికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు.. హైదరాబాద్‌ పంజాగుట్టలో ఉండే పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలోని కొన్ని ఫ్లాట్లలో, సోమాజీగూడలోని గ్రానైట్‌ వ్యాపారి శ్రీధర్‌ ఇంట్లోనూ తనిఖీలు చేశారు.

Exit mobile version