Gangula Kamalakar Pressmeet After CBI Investigation: నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కేసులో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ఎంపీ గాయత్రి రవిలను సీబీఐ నేడు న్యూఢిల్లీలో ప్రశ్నించింది. ఆ ఇద్దరిని అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ విచారణ.. రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన గంగులా కమలాకర్.. తాము విచారణకు పూర్తిగా సహకరించామని, ఇదే తమకు చివరి విచారణ అని స్పష్టం చేశారు. తాము అతడితో ఎలాంటి లావాదేవీలు జరపలేదని.. ఎలాంటి గిఫ్టులు గానీ, గోల్డు గానీ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.
తాము చెప్పిన అంశాలను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకున్నారని.. తామిచ్చిన సమాచారంతో వాళ్ల వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులు సరిపోల్చుకున్నారని గంగులా కమలాకర్ తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ను సైతం తమ ముందు పలు ప్రశ్నలు అడిగారన్నారు. తామిచ్చిన సమాధానాలతో సీబీఐ అధికారులు సంతృప్తి చెందారన్నారు. తమతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని శ్రీనివాస్ ఒప్పుకున్నాడని.. తామిచ్చిన స్టేట్మెంట్‌లపై సంతకాలు తీసుకున్నారని చెప్పారు. తమకు సీఆర్పీసీ 160 ప్రకారం బుధవారం నోటీసులు వచ్చాయని, చట్టాలపై గౌరవం ఉండటంతో వెంటనే ఢిల్లీకి వచ్చి విచారణకు సహకరించామని అన్నారు.
శ్రీనివాస్ ఫోన్ కాంటాక్ట్‌లో తన ఫోన్ నంబర్‌తో పాటు ఫోటోలు ఉన్నందువల్లే విచారణకు పిలిచామని సీబీఐ అధికారులు చెప్పారని గంగుల కమలాకర్ చెప్పారు. శ్రీనివాస్‌ని తాను మున్నూరు కాపు సమావేశంలో అనుకోకుండా కలిశానని, మొత్తం రెండుసార్లు అతడ్ని కలవడం జరిగిందని తెలిపారు. శ్రీనివాస్‌ని మున్నూరు కాపు బిడ్డగా, ఐపీఎస్ ఆఫీసర్‌గా గుర్తించామే తప్ప.. అతడితో ఎలాంటి లావాదేవీలు జరపలేదన్నారు. తాము ఉన్నది ఉన్నట్లుగా చెప్పామని, మళ్లీ విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పలేదని గంగుల కమలాకర్ వివరించారు.
