NTV Telugu Site icon

Funds Misuse: సర్పంచ్, ఉప సర్పంచ్ భర్తల నిధుల స్వాహా

అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్టుగా గ్రామ పంచాయతీ నిధులు స్వాహా అవుతున్నాయి. స్వయానా సర్పంచ్, ఉప సర్పంచ్ భర్త లు కుమ్మక్కయ్యారు. వారికి ఓ ప్రజా ప్రతినిధి కూడా మద్దతు ఇవ్వడం, మరో ఉన్నతాధికారి కూడా వారికి వంతపాడడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలసి కోటిన్నర పైగా స్వాహా చేశారు. స్వంత పేర్లతో చెక్కుల ద్వారా డబ్బులు స్వాహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తప్పనిసరి పరిస్థితిలో ఆ ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపహాడ్ మండలంలోని నాగినేని పాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్కామ్ చూస్తే గుడ్లు తేలెయ్యాల్సిందే. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు ఒక్కటి అయ్యారు. వారి భర్తలమీద చెక్ లను రాయించుకుని స్వాహా చేశారు. ఇద్దరూ కలిసి 116 చెక్ ల రూపంలో కోటి, 27లక్షల 8 వేల 324 రూపాయలు స్వాహా చేసిన అంశం బయటకు పొక్కకుండా బహు జాగ్రత్తగా అధికారులు కూడా సహకరించారు.

నాగినేనిప్రోలు పంచాయతీలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. పంచాయతీ అభివృద్ధి పనుల పేరిట సుమారు కోటిరూపాయలకు పైగా నిధులను భర్తల పేరిట డ్రా చేశారు సర్పంచ్ శ్రావణి, ఉపసర్పంచ్ ఝాన్సీ లక్ష్మీలు. వారు భర్తల పేరిట చెక్కులను రాసి ప్రజల సొమ్మును స్వాహా చేశారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఇక్కడ ఉన్న ఓ ప్రజా ప్రతినిధి , ఉన్నత స్థాయి అధికారి కూడా వారికి మద్దతు ఇచ్చారని తెలుస్తోంది. ఇంకేముంది ఆ నిధుల స్వాహా వ్యవహారాన్ని బయట పడకుండా ఆ జిల్లా అధికారులు కూడా సహకరించారన్న అరోపణలు ఉన్నాయి.

నిధులు దుర్వినియోగం జరిగాయని గతంలోనే జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వగా ఆరు నెలల క్రితమే సర్పంచ్, ఉప సర్పంచ్ లకు జిల్లా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసు ఇచ్చినప్పటికీ అవి మాత్రం మీడియాకు ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అక్రమాలు జరిగాయని 2021 జూన్ లోనే మండల అధికారులు నివేదిక సమర్పించినప్పటికి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ నుంచి ఓ ఉన్నతాధికారి అదే విధంగా జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి అడ్డకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

వారిద్దరి వల్ల జిల్లా అధికారులు ఇంత కాలం చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు కూడా తూ తూ మంత్రంగా చర్యలను ప్రారంభించారు. వాస్తవానికి పదవులనుంచి తొలగించాల్సి ఉండగా వారిని కేవలం మూడు నెలల పాటు తొలగిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి జిల్లా అధికారులను వివరణ అడిగితే మీడియాకు సమాచారం ఇవ్వవద్దని ఆదేశాలు ఉన్నాయని మేం మీడియా ముందు మాట్లాడమని అధికారులు చెబుతూ దాటవేస్తున్నారంటే వారి మీద అధికారులు ఎంతగా వత్తిడి చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.