వరి ధాన్యాన్ని తన కల్లంలోనే కొనుగోలు చేయాలని విధుల్లో ఉన్న ప్రాథమిక పీఏసీఎస్ సీఈఓపై ఓ రైతు పెట్రోల్ పోశాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. CEO కథనం ప్రకారం గ్రామానికి చెందిన గజ్జెల విఠల్ తన పొలంలో పండిన రైస్ గ్రైయిన్ ని కల్లంలోనే కుప్పగా పోశాడు. దగ్గరలోనే కొనుగోలు కేంద్రం ఉన్నప్పటికీ ధాన్యాన్ని అక్కడికి తీసుకు వెళ్ళకుండా కల్లంలోనే కొనుగోలు చేయాలని కల్హేర్ పీఏసీఎస్ సీఈఓ భాస్కర్ మీద కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు.
కేంద్రంలో ఇతర రైతుల ధాన్యం కుప్పలు వరుసక్రమంలో ఉన్నాయని, వాటిని ఆ ప్రకారమే కొంటున్నామని ఆయన సమాధానం చెప్పాడు. వెంటనే తన ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని సదరు రైతు ఓ రాజకీయ నాయకుడితోనూ సీఈవో కు చెప్పించాడని పేర్కొన్నారు. అయినా కొనుగోలు చేయడం లేదనే కోపంతో గోదాం వద్ద ఉన్న సీఈఓపై రైతు విఠల్ ఒక్కసారిగా సీసాలో తెచ్చిన పెట్రోల్ పోశాడని, ఈ ఘటనతో కంగుతిన్న భాస్కర్ వెంటనే తేరుకొని పెట్రోల్ తో తడిసిన దుస్తులు విప్పేసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎక్సై ప్రశాంత్ తెలిపారు.
అయితే పెట్రోల్ పోసిన రైతు విఠల్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ధాన్యం తెచ్చి నెల రోజులయ్యిందని వాపోయాడు. భాస్కర్ అనే అధికారి కావాలనే నా వడ్లు కొనడం లేదని ఆరోపించాడు. నాకంటే వెనుక తీసుకు వచ్చిన ధాన్యాన్ని కొన్నాడు.. కానీ, నావి మాత్రం కొనలేదని కన్నీరుమున్నీరయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే భాస్కర్ వడ్లు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు తెచ్చి పంట పండించాను.. అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని కన్నీటిపర్వంతమయ్యాడు. పెట్రోలు తో భాస్కర్ ని తగలబెట్టి నేను కూడా పెట్రోల్ పోసుకుని చనిపోదాం అనుకున్ననని వాపోయాడు. ఇంకో రెండు రోజుల్లో వడ్లు కొనకుంటే నేనె చనిపోతా అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, రైతుల వద్ద నుంచి ధాన్యం తామే కొనుగోలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతనెలలో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వరి రారుండా చర్యలు చేపట్టారు. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి వరి ధాన్యం రాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు రాస్ట్రాల సరిహద్దుల్లో 51 చోట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రం దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లుల దగ్గర స్పెషల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తారు. వరి కొనుగోళ్ల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ వరికి రూ.1960 ధర ప్రకటించింది.