NTV Telugu Site icon

Etela Rajender: మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్.. ఇదే కేసీఆర్ పాలన

Etela Rajender

Etela Rajender

Etela Rajender Demands Sitting Judge Investigation On TSPSC Paper Leak: మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్ అన్నట్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కెసిఆర్‌కు ప్రతీదీ రాజకీయం చేయడం పరిపాటి అయ్యిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, కవిత లిక్కర్ కేసు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్.. ఇలా అన్నింటినీ రాజకీయం చేసి, తన అసమర్థత – అవినీతి పాలనను కప్పిపుచ్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని పేర్కొన్నారు. కోటి ఆశలతో పరీక్షలకు ప్రిపేర్ అయిన నిరుద్యోగులపై.. ఈ పేపర్ లీక్ వార్త పిడుగు పడినట్లు అయ్యిందన్నారు. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి, సమగ్ర దర్యాప్తు చేయించి, కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు. సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించి, దోషులు తప్పించుకొకుండా వారికి కఠిన శిక్ష పడేలా చూడాల్సిన ముఖ్యమంత్రి.. రాజకీయ రంగు పూసి తప్పించుకోవాలని చూడడం తన అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు.

Vijayashanti: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. చీకట్లో నెట్టారు

కోటి కలలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులను కేసీఆర్ సర్కార్ నిండా ముంచుతోందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఉద్యోగాలు సరిగ్గా భర్తీ చేయకపోగా.. చేసిన కొన్నింటిలోనూ అక్రమాలకు పాల్పడుతూ, యువత భవిష్యత్తును అందకారంలోకి నెట్టేస్తున్నారని అన్నారు. తెలంగాణలో మొత్తం 30 లక్షలమంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. కేవలం నోటిఫికేషన్లతో సరిపెడుతున్నారని చెప్పారు. ఒకటి అర పరీక్షల్ని సైతం పకడ్బందీగా నిర్వహించలేని నిస్సహాయక స్థితిలో కెసిఆర్ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమన్నారు. పేపర్ లీక్ అవ్వగానే పరీక్ష రద్దు చేస్తామని సింపుల్‌గా ప్రకటిస్తున్నారని.. కానీ దాని వెనుక ఎంతమంది నిరుద్యోగుల ఆర్థనాదాలు ఉన్నాయో అర్థం చేసుకొనే హృదయం కేసీఆర్‌కి ఉందా? అని ప్రశ్నించారు. ఎంతోమంది తల్లులు కూలీ పని చేసి, తమ పిల్లలకు చదువులు చెప్పించి, ఉద్యోగం కోసం ఎదురుచూసే ఆ తల్లుల బాధ కేసీఆర్‌కి అర్థం అవుతుందా? అని నిలదీశారు. లక్షల రూపాయల ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకొని, సంవత్సరాల తరబడి చదువుకొని పరీక్ష రాసేందుకు సిద్ధమైతే.. ఆ పరీక్ష రద్దు చేసి వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఫైర్ అయ్యారు.

Bandi Sanjay: నేరస్తుల్ని కాపాడేందుకు సిట్.. కేటీఆర్ రాజీనామా చేయాలి

సర్వీస్ కమీషన్ పరీక్ష అంటేనే అత్యంత పగడ్బందిగా నిర్వహించాల్సిన పరీక్ష అని.. అక్కడ సమర్ధులను, నిజాయితీపరులకు అవకాశం ఇవ్వాలని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. పరీక్షాపత్రాలు లీక్ అవ్వకుండా, అవినీతి జరగకుండా నిఘా పెట్టాలన్నారు. కానీ.. కేసీఆర్ ఇలాంటి వాటిపై కాకుండా, ప్రత్యర్థి నాయకులమీద నిఘా పెట్టేందుకు ఇంటిలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రీతిలాంటి అమ్మాయిలది ఆత్మహత్యనా, హత్యనా అని తేల్చడానికి నిఘా పెట్టరు కానీ.. పక్కవాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టీ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారన్నారు. ఈ చిల్లర పనులు చేసే బదులు.. విద్యార్థుల భవిష్యత్తు మీద దృష్టిపెడితే, వారికి ఈ మానసిక క్షోభ ఉండేది కాదు కదా అని హితవు పలికారు. ఇప్పటికైనా కేసీఆర్ దీనికి భాధ్యత వహించి, నిరుద్యోగుల ఆందోళన తొలగించాలని కోరారు. సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించడంతో పాటు నిరుద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Show comments