Errabelli Dayakar Rao Shocking Comments On Moinabad Episode: మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన బేరసారాల వ్యవహారంపై మంత్రి ఎర్రబెట్టి దయాకర్ రావు తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, దాన్ని పోలీసులు చూసుకుంటారని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి చెందిన సుషి కంపెనీ ద్వారా డబ్బులను పంపిణీ చేస్తూ.. నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అడ్డంగా ఆడియోలు, వీడియోలు దొరికిన తరువాత కూడా ప్రమాణాలు చేస్తే.. ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక చండూర్‌లో జరిగే సీఎం కేసీఆర్ సభకు భారీ స్థాయిలో జనం తరలి వస్తున్నారని, ఈ సభలో మునుగోడు అభివృద్ధిపైనే సీఎం మాట్లాడుతారని తెలిపారు.
అంతకుముందు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అధికార దాహంతోనే అంధకారంలో ఉన్న బీజేపీ, ప్రజాస్వామ్యంతో పరిహాసం ఆడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంతో పనిలేకుండా ధనస్వామ్యంతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వానికి బీజేపీ తెరతీసిందన్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల్లో సాగినట్టు బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని.. కోట్లు, కాంట్రాక్టులు, పదవులు ఆశగా చూపెట్టి తమ ఎమ్మెల్యేలను ఆ పార్టీ కొనలేదని అన్నారు. బీజేపీ చేసిన కొనుగోలు కుట్రలను తిప్పికొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడంతోనే బీజేపీకి భయం పట్టుకుందని.. ఎక్కడ తమ ఢిల్లీ పీఠం కదులుతుందోనన్న భయంతోనే ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, టీఆర్ఎస్‌పై బురద జల్లేందుకు ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవలేకే.. బీజేపి ఈ కుట్రకు తెరతీసిందని పేర్కొన్నారు.