Errabelli Dayakar Rao Fires on BJP: బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు తీర్పునిచ్చారన్నారు. రాజగోపాల్ రెడ్డిని బీజేపీ రూ. 18 వేల కోట్లకు కొనుగోలు చేసి, ఆయన్ను బలి పశువును చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల కోసం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని నాటకం ఆడారన్నారు. మునుగోడు ప్రజలు వారి నాటకాలకు తెరదించారన్నారు. మునుగోడులో బీజేపీలో ఇచ్చిన హామీలన్నింటిని దేశం మొత్తం అమలు చేయాలని, ఆ మేరకు బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తేలేని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సిగ్గు సిగ్గులేదని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అని, ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోందని, ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు. అమిత్ షా, రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేసి.. తెలంగాణలో చిచ్చు పెట్టడానికే ఈ మునుగోడు ఉప ఎన్నికలను తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికలు మునుగోడు అభివృద్ధికి, దేశ రాజకీయాల్లో కీలక మలుపు అన్నారు. ఇక బీజేపీ చేసేవన్నీ కుట్రలేనంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రాకుండా బీజేపీ కుట్రలు పన్నుతోందని పేర్కొన్నారు.
అంతేకాదు.. అప్పులు రాకుండా, మత చిచ్చు రేపేందుకు, ఎమ్మెల్యేలకు కొనేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు, బీజేపీ ఎన్నో కుట్రలకు తెరలేపిందని ఎర్రబెల్లి చెప్పారు. బీజేపీ తెలంగాణకు శత్రువని తెలిపారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోడీ చెప్తుంటారని.. బియ్యం కొనమంటే, తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పమని కేంద్ర మంత్రి పీయూష్ గొయల్ అంటుంటాడని గుర్తు చేశారు. మత చిచ్చు పెట్టే విధంగా.. వాళ్ళ ఎమ్మెల్యేలే రెచ్చగొడతారని ఎర్రబెల్లి ఉద్ఘాటించారు.
