Errabelli Dayakar Rao Fires On Assam CM Himantha Biswa Sarma: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుగుతోన్న హైదరాబాద్‌లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే ఆయన వచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా గణేశ్ జరుగుతున్నట్లే అసోంలో కూడా జరుగుతోందని.. అక్కడి వేడుకల్లో పాల్గొనకుండా హైదరాబాద్ రావడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఎనిమిదేళ్ల నుంచి ఎలాంటి అల్లర్లు లేకుండా హైదరాబాద్‌లో నిమజ్జనం జరుగుతోందని, కానీ అసోం సీఎం రాక వల్ల నగరంలో ఉద్రిక్తత నెలకొందని విమర్శించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో.. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ నేతలు మతఘర్షణలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఫైరయ్యారు.
ఇదిలావుండగా.. గణేశ్ ఉత్సవ కమిటీలో ప్రసంగించిన అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నేత నందుబిలాల్ ఒక్కసారిగా వెనుక నుంచి చొచ్చుకొని వచ్చి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మైక్ లాక్కొని, అసోం సీఎంతో వాగ్వాదానికి దిగారు. అప్పుడు కమిటీ సభ్యులు వెంటనే నందుబిలాల్‌ని వేదిక నుంచి కిందకు దింపేయగా.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార, బీజేపీ నేతలు సైతం పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.