NTV Telugu Site icon

Nama Nageswara Rao: ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఈడీ షాక్.. ఆస్తులు జప్తు

Ed Shocks Nama

Ed Shocks Nama

Enforcement Department Gives Shock To Nama Nageswara Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఎన్‌ఫోర్స్‌‌‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) షాకిచ్చింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో ఆయన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన రూ. 80.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని అటాచ్ చేసిన ఈడీ.. హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులను సైతం అటాచ్ చేసింది. గతంలోనూ రూ. 73.74 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే పేరిట రుణాలు తీసుకొని, వాటిని మళ్లించారని ఈడీ పేర్కొంది. సుమారు రూ. 361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామన్నారు. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో ఆరు డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.

కాగా.. నామా నాగేశ్వరరావుకు సంబంధించిన మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థ.. 2011లో జార్ఖండ్‌లోని రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌ వరకు 163 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి కాంట్రాక్టు తీసుకుంది. ఈ రహదారి నిర్మాణం కోసం కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ. 1,030 కోట్ల రుణం పొందింది. మొదట్లో రహదారి పనుల్ని వేగవంతం చేశారు కానీ, ఆ తర్వాత చేతులెత్తేశారు. నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా.. 50.24 శాతం మాత్రమే చేశారు. ఈ విషయంపై సీబీఐకి ఫిర్యాదు చేసిన ఎన్‌హెచ్‌ఏఐ.. ఈ రోడ్డు నిర్మాణం కోసం 90 శాతం రుణం పొంది, నిర్మాణ పనులు ఆ సంస్థ ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో.. 2019లో సీబీఐ కేసు నమోదు చేసి, విరాచణ చేపట్టింది. ఇందులో భాగంగానే తాజాగా ఈడీ నామా నాగేశ్వరరావు ఆస్తుల్ని జప్తు చేసింది.