NTV Telugu Site icon

Electric Buses: నగరానికి మరో వెయ్యి విద్యుత్‌ బస్సులు.. చార్జీలు చాలా తక్కువ..

Electric Buses In Hyderabad

Electric Buses In Hyderabad

Electric buses in hyderabad: ఆర్టీసీ గ్రేటర్ జోన్‌లో గత నెలలో ప్రవేశపెట్టిన 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 100 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేయనున్నాయి. ఈ 25 బస్సుల్లో 10 బస్సులను పుష్పక్ పేరుతో విమానాశ్రయానికి నడుపుతున్నారు. మిగిలిన 15 బస్సులు బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌, సికింద్రాబాద్‌ నుంచి వేవ్‌రాక్‌ వరకు రెండు రూట్లలో నడుస్తుండడంతో ఆర్టీసీకి మంచి లాభాలు వస్తున్నాయి. నగరంలో ఈ రెండు రూట్లలో నడిచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఐటీ, బ్యాంకు తదితర రంగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ఛార్జీలు నిర్ణయించారు. మొదటి స్టాప్ నుంచి చివరి స్టాప్ వరకు రూ.50 నుంచి 60 వరకు మాత్రమే టిక్కెట్టు ధర నిర్ణయించగా.. మెట్రో ఎక్స్ ప్రెస్ చార్జీల కంటే రూ.5 మాత్రమే ఎక్కువ.

అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సుల కంటే ఇక్కడ నడిచే ఎలక్ట్రిక్ బస్సుల చార్జీలు చాలా తక్కువగా ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు మరో రెండు మూడు నెలల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. వాయు, శబ్ద కాలుష్యం లేకుండా నగరవాసుల ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించారు. వీటిలో 50 బస్సులను మాత్రమే ఏసీకి మార్చగా, మిగిలినవి నాన్-ఏసీ బస్సులుగా నడపనున్నారు. ఈ బస్సులో టికెట్ చార్జీలు కూడా తక్కువే. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఓలెక్ట్రాతో ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. నగరంలోని ఇబ్రహీంపట్నం నుంచి జేబీఎస్ వరకు పది కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. వీటిలో ఇబ్రహీంపట్నం నుంచి ఐదు బస్సులు, జేబీఎస్ నుంచి ఐదు బస్సులు 9 స్టాప్‌లతో ప్రయాణికులకు ప్రతి 20 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులోకి వచ్చింది. టిక్కెట్టు రూ.60గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి ఈ సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
Sreeleela : అరుదైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల..నిజామా?