NTV Telugu Site icon

Delhi Liquor Scam: ఈడీ దూకుడు.. హైదరాబాద్‌లో మరోసారి సోదాలు

Ed Raids Hyderabad

Ed Raids Hyderabad

ED Raids In Hyderabad Again In Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో మరోసారి సోదాలు నిర్వహించింది. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి నాలుగు బృందాలుగా బయలుదేరిన అధికారులు.. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, మాదాపూర్‌లోని పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీ చేశారు. కరీంనగర్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో సైతం సోదాలు జరిపినట్లు తెలిసింది. 10 రోజుల వ్యవధిలోనే ఈడీ అధికారులు హైదరాబాద్‌లో రెండోసారి సోదాలు జరిపారు.

ఎమ్మెల్యే కాలనీలో ఉండే వెన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో రెండు గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ అధికారులు.. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని, ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన్న విచారించారు. ఈ కేసులో ఇంతకుముందు రామచంద్రపిళ్లై ప్రశ్నించినప్పుడు.. అతడు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీనివాసరావును ప్రశ్నించారు. అతని వద్ద నుంచి కొన్ని కీలక పత్రాలతో పాటు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ స్కామ్‌ వ్యవహారంలో ఈడీ ఇదివరకే 40 చోట్ల తనిఖీలు జరిపిన సంగతి తెలిసిందే! ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా ఏర్పడి, స్థానిక అధికారుల సహాయంతో తనిఖీలకు వెళ్లారు.

దర్యాప్తులో భాగంగా ఈ స్కామ్‌లో భారీఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని అనుమానాలు రావడంతో, ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్’ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన ఈడీ హైదరాబాద్‌లో దాడులు చేసింది. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో, కోకాపేట్‌​లోని రాంచంద్ర పిళ్లై నివాసంలో ఈడీ అధికారులు తనిఖీ చేశారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించారు.