నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుటకై తక్షణమే నోటిఫికేషన్స్ వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI)అధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఈ నెల 25న జరిగే ధర్నాకు నిరుద్యోగ యువత హాజరై జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్‌లు పిలుపునిచ్చారు. బుధవారం డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్స్ వేయకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలాయాపన చేస్తుండడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
ప్రభుత్వం పూటకో ప్రకటనలు చేస్తూ త్వరలో నోటిఫికేషన్స్ అంటున్నదే తప్ప నోటిఫికేషన్స్ వేయకుండా నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మూడేండ్లు గడుస్తున్నా నేటికి నిరుద్యోగ భృతి హమీ అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. కొలువులను భర్తీ చేయకుండా, భృతి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 25 న డీవైఎఫ్‌ఐ అధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు నిరుద్యోగ యువత అధికసంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
