Site icon NTV Telugu

Doctors operated: ఆపరేషన్ చేశాడు కడుపులో క్లాత్ మరిచాడు.. 16 నెలల తర్వాత చూస్తే..

Doctors Operated

Doctors Operated

Doctors operated: జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. 16 నెలల క్రితం నవ్యశ్రీ అనే మహిళ ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి డెలివరీ చేశారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న తర్వాత ఇంటికి పంపించారు. అయితే ఆపరేషన్ సమయంలో మహిళ కడుపులోని గుడ్డను వైద్యులు మరిచిపోయారు. వైద్యులు గుడ్డను లోపల ఉంచి మహిళకు కుట్లు వేశారు. నవ్యశ్రీ ఏడాది నుంచి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్ కు గురయ్యారు. ఆమె కడుపులో గుడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు వెంటనే వైద్యం చేయాలని లేదంటే ప్రాణానికే ముప్పని తెలుపడంతో కుటుంబ సభ్యులు సరే అన్నారు. దీంతో వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి గుడ్డను తొలగించారు. గుడ్డ బయటకు తీస్తుండగా వీడియో తీశారు. మహిళ పరిస్థితి ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

నవ్వశ్రీ ఆవేదన..

గతంలో ప్రసవం కోసం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి వెళ్లానని, అక్కడ వైద్యులు ఆపరేషన్ చేశారని నవ్యశ్రీ తెలిపారు. ఆపరేషన్ సమయంలో కడుపులో గుడ్డ పెట్టి బయటకు తీయడం మరిచిపోయారని చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత నవ్యశ్రీకి కడుపులో నొప్పి మొదలైంది. మొదట్లో ఆమె దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే ఇటీవల ఆమె కడుపునొప్పి తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి కడుపులోని గుడ్డను తొలగించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ మహిళ గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
RMP Doctor: ఆర్ఎంపీని అన్నాడు.. అందినకాడికి దోచుకున్నాడు

Exit mobile version