Food Safety : గడువు ముగిసిన మసాలా ఉత్పత్తులపై దొంగ తేదీలు ముద్రించి, మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న ఓ తయారీ యూనిట్‌పై ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ (SOT) పోలీసులు మెరుపు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న ‘దిల్ బహార్’ తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించి, రూ.లక్ష విలువైన కాలం చెల్లిన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెల్లటి స్టిక్కర్లతో మోసం.. పక్కా సమాచారంతో దాడులు
ఈ తనిఖీల సందర్భంగా ఎలాంటి సక్రమమైన తేదీ వివరాలు లేకుండానే పలు రకాల మసాలా ఉత్పత్తులను తయారీ చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా, గడువు ముగిసిన ప్యాకెట్లపై ఉన్న అసలు ఎక్స్‌పైరీ తేదీలను తెల్లటి స్టిక్కర్లతో కప్పివేసి, వాటిపై నకిలీ కొత్త తేదీలను ముద్రిస్తున్నట్లు విచారణలో తేలింది. ఆపై ఆ ప్యాకెట్లను తిరిగి రీ-సీల్ చేసి, మార్కెట్లో గడువు ముగియని తాజా ఉత్పత్తులుగా చూపిస్తూ విక్రయించేందుకు, వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
రూ.లక్ష సరుకు జప్తు.. యజమాని, మేనేజర్‌పై కేసు
ఈ దాడుల్లో దిల్ బహార్ బ్రాండ్‌కు చెందిన మటన్ బిర్యానీ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, సబ్జీ మసాలా, చికెన్ మసాలా, మీట్ మసాలా, టీ పౌడర్‌తో పాటు ఇతర మసాలా ఉత్పత్తులకు సంబంధించిన సుమారు రూ.లక్ష విలువైన సరుకును పోలీసులు జప్తు చేశారు. ఈ అక్రమ రవాణా, కల్తీ వ్యవహారంలో తయారీ యూనిట్ మేనేజర్ షేక్ జహంగీర్, యజమాని షేక్ మహ్మద్ నబీలను గుర్తించారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించగా, వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

