Site icon NTV Telugu

Dharmapuri Arvind: నిజామాబాద్‌లో శాంతి భద్రతలు క్షీణించాయి

Dharmapuri Arvind

Dharmapuri Arvind

నిజామాబాద్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వమించిన బీజేపీ అధ్యక్షన కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో గంజాయి కూడా విచ్చలవిడిగా సరఫరా అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిజామాబాద్ పోలీసు క‌మిష‌నర్ వైఫ‌ల్యం చెందారని ఆరోపించారు. జిల్లాలో ప్రజాప్రతినిదులను హ‌త్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని.. ఎంపీగా ఉన్న తనపై కూడా హత్యాయత్నం జరిగిందన్నారు. స్వయంగా తానే ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల స‌హ‌కారంతోనే వంద‌లాది మంది రోహింగ్యాలు నకిలీ పాస్‌పోర్టులతో చలామణి అవుతున్నారన్నారు.

జగిత్యాలకు చెందిన వ్యక్తి నిజామాబాద్ వేదికగా ఉగ్ర శిక్షణను ఇస్తున్నారని.. ఈ క్యాంపులో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ న‌లుమూల‌ల నుండి వ‌చ్చి శిక్షణ తీసుకుంటున్నారని, ఇంత జరుగుతున్నా సీపీ నాగరాజుకు ఎందుకు తెలియలేదని అర్వింద్ ప్రశ్నించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు కలిసి నిజామాబాద్ కమిషనర్‌గా నాగరాజును తీసుకొచ్చాయని.. ఆయన్ను కమిషనర్ స్థానం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి విస్మరించిందని విమర్శించారు. ప్రజాసమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాల అధ్యయన కమిటీ తొలిసారి సమావేశం అయ్యిందని చెప్పిన అర్వింద్.. మరిన్ని సమావేశాలు నిర్వహించి ప్రజాసమస్యల్ని గుర్తిస్తామన్నారు. గ‌ల్లీ నుండి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు సమస్యల్ని గుర్తించి.. రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తామని ధర్మపురి అర్వింద్ వెల్లడించారు.

Exit mobile version