NTV Telugu Site icon

Farmer Bank Account: కిసాన్ క్రెడిట్ ఖాతాలోకి రూ. 60 కోట్లు

మన బ్యాంకులో ఎంత మొత్తం వుందో మనకు తెలుసు. అలాగే మన బ్యాంకులోకి ఎప్పుడు డబ్బులు వస్తాయో కూడా మనకు తెలుసు. కానీ హఠాత్తుగా లక్షలు కాదు కోట్ల డబ్బులు వచ్చిపడితే పరిస్థితి ఎలా వుంటుంది. అలాంటి అనుభవం ఓ రైతుకి కలిగింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ రైతు కిసాన్‌ క్రెడిట్‌ ఖాతాలోకి ఏకంగా రూ. 60 కోట్ల డబ్బులు జమ కావడం చర్చనీయాంశం అయింది. అతనితో పాటు మరో ఇద్దరి ఖాతాల్లో రూ. లక్షల్లో డబ్బు వచ్చి చేరింది. ఈ మొత్తం సొమ్ములోంచి ఓ సర్వీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు, రైతులు దాదాపు రూ. 1.28 కోట్లు విత్‌డ్రా చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు విత్‌డ్రా చేసిన డబ్బులను రివకరీ చేయడం ప్రారంభించారు.

ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం మామిడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న సల్పలగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ కోలాం రైతులైన కొడప భీంరావు, రమాబాయి, గంగాదేవిలకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆదిలాబాద్‌ బ్రాంచ్‌లో కిసాన్‌ క్రెడిట్‌ ఖాతాలున్నాయి. ఇందులో భీంరావు ఖాతాలో రూ. 60 కోట్లు, మరో ఇద్దరి ఖాతాల్లో రూ. లక్షల్లో డబ్బులు జమయ్యాయి. వీళ్లు ఓసారి డబ్బులు తీసుకునేందుకని పక్కనే ఉన్న మామిడిగూడ గ్రామంలోని కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ కు వెళ్లారు. ఈ ఖాతాల నుంచి రూ.కోటీ 28 లక్షలు విత్ డ్రా చేశారు. గ్రామీణ బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బ్యాంకు అధికారులు రంగంలోకి దిగి రికవరీ ప్రారంభించారు. రైతుల నుంచి రూ.80 లక్షలు, రైతుల నుంచి బంగారం తదితర వస్తువులను పట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యల వల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రికవరీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.