Site icon NTV Telugu

CPI Narayana: బీజేపీని అడ్డుకునేందుకే టీఆర్ఎస్‌కు మద్దతు

Cpi Narayana Clarity On Trs

Cpi Narayana Clarity On Trs

CPI Narayana Reveals Why They Are Supporting TRS: సీఎం కేసీఆర్‌కు వామపక్షాల మద్దతు సిగ్గుచేటని మునుగోడు సమరభేరి వేదికలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ స్పందించారు. బీజేపీని అడ్డుకోవడం కోసమే తాము టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత మొదలైందని, తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్‌కు ఉందని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని బీజేపీ కూల్చేసిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎన్‌డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని చెప్పిన నారాయణ.. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కలిపే పనుల్లో సీపీఐ ఉందని, ఆ క్రమంలోనే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని వివరించారు.

అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అన్ని పార్టీలో బీజేపీతో అంటకాగుతున్నాయని నారాయణ విమర్శించారు. మోదీ షేక్ హ్యాండ్ ఇస్తేనే చంద్రబాబు మురిసిపోతున్నారని, పవన్ కళ్యాణ్ సైతం బీజేపీ గూటిలోనే ఉన్నారని అన్నారు. బీజేపీతో వైఎస్సార్‌సీపీ చేతులు కలిపితే.. కచ్ఛితంగా జగన్‌కి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. దేశంలో బీజేపీయేతర రాష్ట్రాలు ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్నాయని.. ఏపీలోని పార్టీలు కూడా విశాల ప్రయోజనాల కోసం బీజేపీని వీడి రావాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎవరైతే ఏపీలో బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతారో.. ఆ పార్టీకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇటు.. తెలంగాణలో బీజేపీని టీఆర్ఎస్ తప్పకుండా ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేసిన నారాయణ.. ఇప్పుడు పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కి లేదన్నారు.

Exit mobile version