
తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. ఉదయం నుంచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై ఉన్న వారిని వెనక్కి పంపించారు. సీపీ అంజనీకుమార్ లాక్ డౌన్ పై సమీక్షను నిర్వహించారు. లాక్ డౌన్ ను ప్రజలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రావొద్దని అన్నారు. రంజాన్ సందర్భంగా ప్రజలు ఇళ్లల్లోనే ప్రార్ధనలు జరుపుకోవాలని తెలిపారు. మసీదులో మౌలానాతో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇంట్లో జరిగే ప్రార్థనల్లో కూడా సామాజిక దూరం పాటించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 1800 మందిపై కేసులు పెట్టినట్టు సీపీ పేర్కొన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేసినట్టు అంజనీకుమార్ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.