Site icon NTV Telugu

V. Hanumantha Rao: నేడు దేశం అగ్నిపథ్‌తో అగ్ని గుండంలా మారింది

Hanumanth

Hanumanth

నేడు దేశం అగ్నిపథ్‌తో అగ్ని గుండంలా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు మండిపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ.. ఆయన శుక్రవారం మీడియాతో మాడారు. సైనికుల నియమకాలలో ‘‘అగ్నిపథ్’’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణమని అన్నారు. నాలుగేళ్ల తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. డిఫెన్స్ దగ్గర నిధులు లేవంటే ప్రపంచం ముందు దేశం పరువు ఏమి కావాలని నిలదీశారు. ఇలాంటి విధానాలు బీజేపీ మానుకోవాలని హితవుపలికారు. మహమ్మద్ ప్రవక్త పైన బీజేపీ నాయకులు చేసిన ప్రకటనలతో ప్రపంచం ముందు భారత్ పరువు పోయిందని తెలిపారు. ఇవన్నీ దేశ ప్రతిష్టను మంట గలుపుతున్నాయన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన ప్రధాని మోదీకి పాలించే నైతిక హక్కు లేదని వీహెచ్ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay: ఇదంతా పక్కా ప్లాన్… సికింద్రాబాద్ విధ్వంసంపై బండి

Exit mobile version