తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించామని అన్నారు. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధానించాలని మొన్ననే ప్రధానిని కోరాము. ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించే ప్రధానంగా చర్చించామని తెలిపారు. తెలంగాణలోని నికర జలాలపై సమ్మక సారక్క ప్రాజెక్టు, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నాం. మా శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? అని ప్రశ్నించారు.
Also Read:Posani Krishnamurali: నరసరావు పేట పోలీస్ స్టేషన్ కు పోసాని!
గోదావరి వరద జలాలపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా నికర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాల్సిందే అని డిమాండ్ చేశారు. సముద్రంలో వృధాగా కలిసే వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. అలాంటప్పుడు నికర జలాలపై ఉన్న మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యతరం చెబుతోందని ప్రశ్నించారు. వరద జలాలపై కట్టిన ఆయకట్టును స్థిరీకరిస్తే.. ఆ మేరకు నీటి కేటాయింపులు జరుపుతామని అంటున్నారు. కృష్ణా జలాలపై కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఆయకట్టు లెక్కల ప్రకారమే తెలంగాణకు తాత్కాలిక వాటా తగ్గింది. కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల 811 టీఎంసీల ఉమ్మడి వాటాలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటోంది.
Also Read:Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ కేవలం 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటోంది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఏపీలో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం వల్లేనని తెలిపారు. కృష్ణా నదిలో తలెత్తిన పరిస్థితి గోదావరి విషయంలో జరగకూడదని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. నికర జలాలపై మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే వరద జలాలపై నిర్మించే ప్రాజెక్టుల సంగతి చూడాలని కోరారు. మా నికర జలాలపై నిర్మించే ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకోవాలన్నారు. వరద జలాలపై వారు నిర్మించే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుందని సీఎం రేవంత్ వెల్లడించారు.