“ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (World Youth Skills Day) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతున్నదన్నారు. అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ప్రణాళికలను రచించి అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు. గత పాలనలో అన్నిరంగాల్లో శిథిలమైన మౌలిక వసతులను తీర్చిదిద్దుకుని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవింపచేసుకుంటూ వస్తు న్నామన్నారు. సకల జన జీవనం గుణాత్మకంగా అభివృద్ధి చెందిననాడే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వం విశ్వసించిందన్నారు.
read also : మెగా రిటైల్ టెక్సటైల్ పార్క్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అందుకు అనుగుణంగానే ప్రాధాన్యతక్రమంలో అభివృద్ధి కార్యాచరణ చేపట్టిందన్నారు. తెలంగాణ గ్రామీణ పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేండ్లుగా అమలు పరుస్తున్న ప్రభుత్వ కార్యాచరణ కొలిక్కివచ్చిందన్నారు. సంపదను సృష్టించి దాన్ని ప్రజలకు పంచడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పునర్నిర్మితమైన తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలను యువతీ యువకులు అనుభవించే పరిస్థితులు నేడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని సీఎం అన్నారు.
సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగాలను గాడిలో పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచి, రైతు సహా సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలుపరుస్తూ వస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదన్నారు.
పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతున్నదన్నారు. పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. పరిశ్రమలు ఐటి రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సీఎం అన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలిచ్చిందని, నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ ప్రారంభమైందని సీఎం అన్నారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు.
