రేపు జరుగనున్న ‘దళితబంధు పథకం’ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ వేదిక ముస్తాబైంది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో వేదికను తయారుచేశారు. వేదికపైకి 15 దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలతో పాటుగా పలువురు ఎంపీలు, మంత్రులు కూర్చోనున్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఈ సభ జరుగనుంది.
ఇక త్వరలోనే హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరుగునున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మాటల తూటాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మధ్య పోటాపోటిగా బల ప్రదర్శలను కొనసాగుతున్నాయి.