NTV Telugu Site icon

New Secretariat: గంటలోపే నూతన సచివాలయ ప్రారంభోత్సవం పూర్తి

Inaugurated New Secretariat

Inaugurated New Secretariat

Inaugurated telangana new secretariat: నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు… ఆత్మగౌరవానికి ప్రతీకగా… సంప్రదాయం, ఆధునికత, సాంకేతికతల మేళవింపుగా… ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించింది. రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున రికార్డు సమయంలో పూర్తి చేసి అత్యంత వైభవాన్ని ప్రదర్శిస్తున్న సమీకృత సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. 1 గంట 20 నిమిషాల నుంచి 1 గంట 32 నిమిషాల మధ్య సచివాలయ ప్రారంభోత్సవం ముగిసింది. సీఎం కేసీఆర్ నిర్ణీత సమయానికి 1 గంట 20 నిమిషాలకు సచివాలయానికి చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీస్సుల మధ్య సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ : అక్కడి నుంచి యాగశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం భవనం ప్రధాన గేటు ఎదుట ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని ప్రారంభించారు.

Read also: TCS Employees: టీసీఎస్ ఉద్యోగుల‌కు గుడ్‌ న్యూస్‌.. వేతనాలు రెట్టింపుకు క‌స‌ర‌త్తు..!

ఇక.. అక్కడి నుంచి బ్యాటరీ వాహనంలో కింది అంతస్తులోని సమావేశ మందిరానికి వెళ్లి అక్కడ వాస్తుపూజలో పాల్గొన్నారు. అనంతరం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న ఆరో అంతస్తుకు చేరుకున్నారు. ఆయన ఛాంబర్‌లో పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం మధ్య కుర్చీలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి వెంటనే ఆరు ముఖ్యమైన పత్రాలపై సంతకం చేశారు. మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల్లో మొత్తం ప్రక్రియ పూర్తయింది. అనంతరం సీఎం కేసీఆర్‌కు మండలి చైర్మన్‌, శాసనమండలి అధ్యక్షుడు, మంత్రులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చున్నారు. మంత్రులందరూ తమ శాఖకు సంబంధించిన పత్రంపై సంతకాలు కూడా చేశారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల వరకు అధికారులు కుర్చీలపై కూర్చొని పత్రంపై సంతకాలు చేశారు. గంటలోపే ప్రారంభోత్సవం పూర్తయింది. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.