NTV Telugu Site icon

Tomato Crop: రైతును వరించిన అదృష్టం.. టమాటా పంట సాగు చేసినందుకు సీఎం సన్మానం

Cm Kcr

Cm Kcr

Tomato Crop: టమోటాలు.. ఈ పేరు వింటేనే ఈ రోజుల్లో సామాన్యులు కంగారు పడుతున్నారు. ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ టమోటాలు కొంతమంది రైతులను రాజులను చేస్తున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే వారు కూడా నెలలో కోట్లు సంపాదించలేరని… కొందరు టమాటా రైతులు మాత్రం రోజుల వ్యవధిలోనే కోట్లకు పడగలెత్తుతున్నారు. తెలంగాణకు చెందిన మహిపాల్ రెడ్డి అనే రైతు టమాటా పంట పండించి కోట్లు సంపాదించడమే కాకుండా అరుదైన గౌరవం అందుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిపాల్ రెడ్డి దంపతులను స్వయంగా సచివాలయానికి పిలిపించి అభినందించడమే కాకుండా శాలువాతో సత్కరించారు.

Read also: Malakpet MMTS: రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురు.. తరువాత ఏం జరిగిందంటే..!

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ గ్రామానికి చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డికి వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో ఎక్కువగా వరి సాగు చేసినా ఆశించిన లాభాలు రాకపోవడంతో కూరగాయల సాగు వైపు మొగ్గు చూపాడు. సుమారు 40 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. అయితే ఈసారి టమాటా రూపంలో జాక్ పాట్ కొట్టేశాడు. ఈసారి రైతు మహిపాల్ రెడ్డి టమోటాలు అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల టమాటా విక్రయించామని, మరో కోటి విలువైన పంటలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని రైతు చెబుతున్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కుతున్న మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వచ్చారు. కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి సన్మానించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి టమోటా రైతు మహిపాల్ రెడ్డి దంపతులను సచివాలయానికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు దంపతులను అభినందించి శాలువాతో సత్కరించారు. రైతు మహిపాల్ రెడ్డిని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా అభినందించారు.

Read also: Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు షాక్.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..