Site icon NTV Telugu

యువత పాత్ర గొప్పది.. భవిష్యత్ తెలంగాణ యువతదే..

kcr

ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంతో పాటు స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదన్నారు.. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం.. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు.

యువత భవిష్యత్తున్‌ దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే దిశగా వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి వంటి రంగాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని సీఎం కేసీఆర్.. ఉపాధికి అవకాశమున్న టూరిజం, లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నదన్నారు. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తుందని వెల్లడించారు. శాస్త్రీయ పద్ధతిలో జోనల్ విధానాన్ని అమలులోకి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు మార్గం విస్తృతం చేసుకున్నామన్నారు. వినూత్న పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా యువత ఉపాధికి బాటలు మెరుగవుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతుందని.. భవిష్యత్ తెలంగాణ యువతదే అన్నారు సీఎం కేసీఆర్.

Exit mobile version