CM KCR Calls To Reversed Selfish Politics In The Name Of Religion: మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూసే స్వార్థ రాజకీయాల్ని తిప్పి కొట్టేందుకు తమతో కలిసి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మత విద్వేషాలకు తావు లేదని, అందుకు ప్రయత్నించే దుష్ట శక్తుల్ని తిప్పి కొడదామని అన్నారు. ఈమేరకు శనివారం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, ఆ పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్‌లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. స్వార్థ రాజకీయాల కోసం, విచ్చిన్నకర శక్తులు తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. వారి కుట్రల్ని తిప్పికొట్టేందుకు కదలిరావాలని తానిచ్చిన పిలుపుకు స్పందించి, తమకు మద్దతు ప్రకటించేందుకు ముందుకొచ్చిన సీపీఎం పార్టీకి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అటు.. మతవిద్వేశ శక్తులను ఎదుర్కునేందుకు తాము పూర్తి మద్దతిస్తామని సీపీఎం నేతలు స్పష్టం చేశారు.
కాగా.. టీఆర్‌ఎస్‌ఎస్పీ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు, నేతలకు కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, 200 శాతం గెలుపు తమ పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే ఇంచార్జ్‌గా ఉంటారన్నారు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీలు గెలిచే అవకాశమే లేదని.. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటే, మూడో స్థానంలో బీజేపీ ఉందని తెలిపారు. బీజేపీ మత పిచ్చి రాజకీయాలు చేస్తోందని.. దాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని.. బీజేపీ బెదిరింపులను ఏమాత్రం పట్టించుకోవద్దని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు ఇక్కడ కుదరదని.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని, తమ పార్టీకి 96 సీట్లు తప్పకుండా వస్తాయని, ఎమ్మెల్యేలంతా ధైర్యంగా తమ పనులు తాము చూసుకోవాలని కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు.. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా జరపాలని తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 16,17,18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు జరపాలని.. ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది. అలాగే.. 2023 సెప్టెంబర్ 17,18,19 తేదీల్లో ముగింపు వేడుకలు జరపాలని నిర్ణయించింది.
