యువత భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు చిరంజీవి సంఘీభావం తెలిపారు. ఈ మహా యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా కిషన్ రెడ్డి మెగాస్టార్‌ను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించగా, ఇందుకు చిరంజీవి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
మత్తుమందుల మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధం: చిరంజీవి
టీ-షర్టుల ఆవిష్కరణ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సమాజాన్ని, ముఖ్యంగా దేశానికి వెన్నెముక అయిన యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ ముందుండి చేయి కలుపుతామని ఆయన స్పష్టం చేశారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం: కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్” పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ ప్రజా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ వేదికగా మూడు రోజుల పాటు సాగే ఈ యాత్రకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు లభించడం ఎంతో సంతోషకరమని, దీనివల్ల యువతలో మరింత చైతన్యం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

