Chada Venkat Reddy Fires On PM Narendra Modi: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు.. తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కొత్తగూడెంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలో ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదంతో దేశంలో బీజేపీ పాలన సాగిస్తోందని అన్నారు. విద్యాలయాలు కాషాయ నిలయాలు కావొద్దని.. విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యాలయాలు మత, కుల నిలయాలు కాకూడదని పోరాడుతోన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. విద్యుత్ సవరణ చట్టం వల్ల సబ్సిడీ ఉండదని, రైతులకు ఉచిత విద్యుత్ దక్కదని వెల్లడించారు. ఆదానీ, అంబానీలు ప్రధాని మోదీకి పెద్ద కొడుకు, చిన్న కొడుకు లాంటివారన్నారు. సహజ వనరులను, దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పేదలు అల్లాడుతోంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం జీఎస్టీతో సామాన్యులపై భారం మోపిందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను మోదీ ప్రభుత్వం విపరీతంగా పెంచిందని.. ట్యాక్స్‌ల కారణంగా సామాన్య ప్రజల బ్రతుకులు దుర్భరంగా తయారయ్యాయని ఆవేదన చెందారు.
సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలు కూడా పెరిగిపోయాయని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నించే వారిని హతమారుస్తూ, రాజద్రోహం కేసులు పెడుతున్నారన్నారు. పౌర హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని.. విద్యార్థులు చదువుతూనే, సామాజిక ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
