Site icon NTV Telugu

Kishan Reddy: బయోమెడికల్ పరిశోధనకు కేరాఫ్ అడ్రస్ NARFBR

Kishan Reddy

Kishan Reddy

జినోమ్ వ్యాలీలోని ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్ కేంద్రం సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 21వ శతాబ్దపు ప్రపంచ బయోమెడికల్ పరిశోధనకు అత్యంత కీలకంగా మారనుంది ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్. భారతదేశంతోపాటు విదేశీ సంస్థలకు కూడా ఇదెంతో ఉపయోగపడుతుందన్నారు కిషన్ రెడ్డి. పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తూ భారతదేశానికి గుర్తింపు తీసుకురావడమే ప్రధాని ఆలోచన అన్నారాయన. వైద్య సంబంధిత అంశాలు వివిధ వ్యాక్సిన్లు, ఔషధాలకు సంబంధించి భారతదేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధలను పరీక్షించే కేంద్రంగా హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ కేంద్రం (ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్) ప్రత్యేకతను సంతరించుకోనుందని కేంద్ర సాంస్కృతిక,పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం జినోమ్ వ్యాలీలోని ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్ ను ఆయన సందర్శించి, సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతో మాట్లాడారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలో మనుషులు, జంతువుల ఆరోగ్యానికి అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి పరచటం కోసం ఒక ప్రత్యేకమైన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని సంకల్పించడం జరిగిందన్నారు. దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో, పరిశోధన, తదితర అవసరాలకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతున్నాయని, దాదాపుగా 60 శాతం పరికరాలు, మిషనరీ వచ్చేశాయని ఆయన వెల్లడించారు.

రానున్న రోజుల్లో మిగిలిన సౌకర్యాలను కూడా మెరుగుపరిచి భారతదేశంతోపాటు విదేశాల్లోని ఔషధ తయారీ,వ్యాక్సిన్ తయారీ, ఇతర పరిశోధనల సంస్థలు తాము తయారుచేసే ఉత్పత్తులకు ఇక్కడ పరిశీలించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో వాక్సిన్ పరీక్ష కేంద్రం ఒక్క హిమాచల్ ప్రదేశ్ లోనే ఉందని, హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా, ఇతర పరిశోధన కంపెనీలు పెరుగుతున్ననేపథ్యంలో ఇక్కడ కూడా ఇలాంటి కేంద్రాన్ని స్థాపించాలని కేంద్రం భావించిందన్నారు.

Read Also:Rohit Sharma: రోహిత్ శర్మపై నెటిజన్‌ల ఫైర్.. జాతీయ జెండాను అవమానించాడంటూ చీవాట్లు

దీనికి 2014-15 లోనే కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఎలుకల నుంచి గుర్రాల వరకు వివిధ జంతువులపై ఇక్కడ పరిశోధనలు జరుగుతాయన్నారు. భారత్ తోపాటు ప్రపంచ అవసరాలు తీర్చేలా ఈ ఇనిస్టిట్యూట్ ను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.విశ్వవిద్యాలయాల విద్యార్థుల పరిశోధనకు, అదేవిధంగా జంతు సంరక్షణకు కూడా చాలా ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో బయోమెడికల్ రీసెర్చ్ విషయంలో ఈ కీలకపాత్ర పోషించనుందన్నారు. మెడికల్ కాలేజీలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, బయోటెక్, బయోఫార్మా కంపెనీలు ఇకపై తమ పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఈ కేంద్రం అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడే 3 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి జరిగేలా ఏర్పాట్లు జరగడాన్ని కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని ఫార్మా కంపెనీలు, పరిశోధనల కేంద్రాలు, వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శిస్తూ ఆయా కేంద్రాలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు. గతంలో భారతదేశానికి టీకాలు అవసరమైతే పక్క దేశాలవైపు చూసేవారమని, ఇందుకు పోలియో టీకాయే ఉదాహరణ అని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మనమే టీకాలు ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా సహాయం చేస్తున్నామన్నారు. ఇందుకోసం కృషిచేస్తున్న పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న మనం..వచ్చే 25 ఏళ్ల కాలంలో (అమృత కాలం) లో చేయాల్సిన అంశాలపై స్పష్టతతో ముందుకెళ్తున్నామని, భారతదేశ యువత తమ శక్తి, సామర్థ్యాలను సద్వినియోగ పరుచుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి సూచించారు.గాలినుంచే ఆక్సీజన్ తయారు చేసుకునే ఆక్సీజన్ ప్లాంట్లను పీఎం కేర్స్ నిధుల ద్వారా వేర్వేరు చోట్ల ఏర్పాటుచేస్తున్నామని, రానున్న రోజుల్లో జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.తెలంగాణతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేసే విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, ఈ దిశగా ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజాసంక్షేమం విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version