Site icon NTV Telugu

శిల్ప చౌద‌రి కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు !

కిట్టీ పార్టీలతో చిట్టీలతో చేసి డబ్బులు ఎగ్గొట్టిన శిల్ప కేసులో… పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. శిల్పను 3 రోజుల కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో ఆమెను చంచల్‌గూడ జైలునుంచి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.. ఇప్పటికే శిల్ప కాల్ రికార్డ్స్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆస్తులు, బినామీలపై ఆరా తీస్తున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ల వద్ద డబ్బులు తీసుకున్నట్లు శిల్పపై కేసు నమోదు అయింది.

నార్సింగి ఎస్‌ఓటీ కార్యాలయంలో శిల్పను పోలీసులు మొదటిరోజు ప్రశ్నించారు. ఆమె జరిపిన లావాదేవీల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నంచేశారు. అయితే శిల్ప పొంతన లేని సమాధానాలు ఇచ్చిన్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలన్ని శిల్ప ముందు పెట్టినా.. వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. శిల్ప.. గతంలో బ్యాంకు లావేదేవీలు జరిపిన సమయంలో.. ఇతర వ్యక్తుల ఖాతాలను వాడుకుంది. ఆ అకౌంట్లు ఎవరెవరివి? వారితో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్నదానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. దాదాపు 100 కోట్లపైకుపైగా వసూలు చేసిన శిల్ప.. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిందనే దానిపై దృష్టిపెట్టారు. సొంత విల్లాకు 20 కోట్ల వరకు ఖర్చు చేస్తే.. మిగతా డబ్బంతా ఎక్కడికి మళ్లించింది అన్నదానిపై కూడా సమాధానం రాబడుతున్నారు.

శిల్ప ఆపరేషన్ స్టైల్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఇంటరాగేషన్‌లో శిల్ప ఎలా కోట్లకు కోట్లు సేకరించింది? కిట్టీ పార్టీల కధా కమామిషు ఏంటి ? సెలబ్రిటీలు, పెద్ద పెద్ద అధికారుల కుటుంబ సభ్యుల్ని ఎలా ట్రాప్ చేసింది? ఐదు రూపాయలు, పది రూపాయల వడ్డీల మర్మం ఏంటి? ఈ కుట్రలో శిల్పకు భాగస్వాములు ఎవరు? శిల్ప ఇచ్చే ఖరీదైన బహుమతుల వెనక కధేంటి? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. శిల్ప రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో పెట్టిన పెట్టుబడులు, వాటికి సంబంధించిన ట్రాన్జాక్షన్లు పరిశీలించి.. పోలీసులు ఓ క్లారిటీకి రానున్నారు. గతంలో కస్టడీ ఉన్న సమయంలోనూ అసలు విషయాలను దాటవేసింది శిల్ప. ఇప్పుడు కూడా ఇంటరాగేషన్‌లో నిజాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.కస్టడీలో మూడు రోజుల పాటు ప్రశ్నించిన తరువాత.. సోమవారం శిల్పను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.

Exit mobile version