NTV Telugu Site icon

Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం

Care Connect Program

Care Connect Program

Care Hospital Conducted Care Connect Program In Banjara Hills Hospital: ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అవయవ మార్పిడి రోగుల కోసం ‘కేర్ కనెక్ట్’ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా వైద్యులు, రోగుల మధ్య స్నేహపూరిత, అనుబంధ వాతావరణం పెంపొందించడంతో పాటు వారిలో మనోధైర్యాన్ని కల్పించే లక్ష్యంతో కృషి చేస్తుంది. బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో శనివారం అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కేర్ ఆసుపత్రి ఆతిథ్య విభాగ హెచ్‌సీఓఓ నీలేష్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. మూత్రపిండాలు, కాలేయం, గుండె మార్పిడి రోగులు, వారి కుటుంబ సభ్యులు, వారికి వైద్యం అందించిన వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. కేర్ ఆసుపత్రి ఆతిథ్య రోగుల సంరక్షణ విభాగం గ్రూప్ ఉపాధ్యక్షులు విజయ్ సేథి మాట్లాడుతూ.. కార్యక్రమానికి స్వాగతం పలికారు. రోగుల్లో మనోనిబ్బరం, శరీర ఆరోగ్యం మెరుగుదలే లక్ష్యంగా ఈ కేర్ కనెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల అనంతర జీవన ప్రయాణంలో రోగి ఆరోగ్యంలో మెరుగుదల, కుటుంబ సభ్యుల సహకారం, సమాజంలో జీవనశైలి విధానాలను వివరించారు. వైద్యులు, వైద్య సిబ్బందితో రోగుల సమ్మేళనం వల్ల వారిలో మరింత ఉత్సాహం కలుగుతుందని, ఆరోగ్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. అనంతరం నీలేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా రోగి వెంట ఉండే సంరక్షకులు, వైద్యుల మధ్య అవగాహన పెంపొందుతుందన్నారు. రోగి ఆరోగ్యం విషయంలో నిరంతర సంరక్షణ అందించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Care Connect Program1

ఈ క్రమంలోనే కొందరు అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు మాట్లాడుతూ.. తమ అనుభవాలను వివరించారు. ఆశావాహ సానుకూల దృక్పథంతో ఎలా జీవనం సాగిస్తున్నారో తెలిపారు. జీవితం పట్ల ఏర్పరచుకున్న నూతన అనుభూతిని వెల్లడించారు. అలాగే పలువురు వైద్యులు మాట్లాడుతూ.. రోగుల సంరక్షణ పట్ల కేర్ ఆస్పత్రికి ఉన్న తిరుగులేని అంకితభావం, సానుకూల దృక్పథాన్ని ఈ కార్యక్రమం వెల్లడి చేస్తుందన్నారు. ఆసుపత్రిలో ఉన్న అధునాతన వైద్య సదుపాయాల గురించి వివరించారు. రోగుల సంరక్షణ కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు సంస్థ కట్టుబడి ఉందన్నారు.

కాగా.. కార్యక్రమంలో కేర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్, యూరాలజీ విభాగ డైరెక్టర్ (కిడ్నీ మార్పిడి) డాక్టర్ ప్రసాద్ రాజు, హృద్రోగ నిపుణులు (గుండె మార్పిడి) డాక్టర్ బికేఎస్ శాస్త్రి, అనస్తీసియా విభాగాధిపతి డాక్టర్ టీవీఎస్ గోపాల్, లాబరేటరీ విభాగాధిపతి డాక్టర్ శ్రీకాంత్, కాలేయ మార్పిడి విభాగాధిపతి డాక్టర్ నయీం, గుండె మార్పిడి విభాగం నుంచి డాక్టర్ సుధీర్, డాక్టర్ నగేష్, కాలేయ మార్పిడి విభాగం నుంచి డాక్టర్ రిజ్వాన్, డాక్టర్ అలీ, డాక్టర్ విక్రాంత్ రెడ్డి, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది, ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు పాల్గొన్నారు.