Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వారిలో ఆరుగురు ఈ సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆరుగురు మంత్రులపై గెలిచిన అభ్యర్థులందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ పై తుమ్మల నాగేశ్వర్ రావు, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ పై అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి. పాలకుర్తిలో దయాకర్‌రావుపై మేఘారెడ్డి, యశస్వినిరెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌పై యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. నిర్మల్‌లో మాత్రమే ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వరరెడ్డి బీజేపీ తరపున గెలిచారు.
ఎర్రబెల్లి దయాకర్ విజయాలకు బ్రేక్
పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈసారి ఓటమి పాలయ్యారు. ఆరుసార్లు విజయాలు సాధిస్తూ వస్తున్న ఎర్రబెల్లి ఈసారి మాత్రం బోల్తాపడ్డారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి తొలి సారిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఇది ఇలా ఉంటే ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసినా మంత్రి ఎర్రబెల్లిని ప్రజలు ఆదరించలేదని ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టం అయింది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలోనే ఆయన తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసినప్పటికీ అనుచరులు చేసిన ఆగడాల వల్ల, మంత్రి దయాకర్ రావు పైన స్థానికంగా వ్యతిరేకత ఏర్పడింది. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటుబ్యాంకుగా మారింది. అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఎన్నారై కాగా, ఆమెకు స్థానికంగా ఉన్న పేరు కూడా ఆమెకు ప్లస్ అయినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు మెజారిటీ ఎన్నికలలో ఓటమి ఎరుగని నేతగా, మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పరాజయం పాలయ్యారు.
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆయనపై టీ మేఘారెడ్డి విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత 2018లో నిరంజన్‌రెడ్డి గెలిచారు. అనంతరం కేసీఆర్ కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఆది నుంచి వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. దీని కారణంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చాడు. గతంలో కాంగ్రెస్ లీడర్ చిన్నారెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. చివరకు ఆయన 2018లో ఓడిపోయారు. బీఆర్‌ఎస్‌లో ఉంటూ రాజకీయం చేసిన మేఘారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు.
పువ్వాడ అజయ్‌కు షాక్
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు చేతిలో అజయ్ ఓటమి పాలయ్యారు. నువ్వా-నేనా అన్నట్లు ప్రస్తుత ఎన్నికల్లో ఇద్దరు తలపడ్డారు. కచ్చితంగా ఈ సీటు గెలుస్తామనే పువ్వాడ ఆది నుంచి ధీమాగా కాంగ్రెస్ జోష్‌లో ఆయనకు ఓటమి తప్పలేదు. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేశారు. ఖమ్మం సీటుపై ఆది నుంచి టార్గెట్ చేసిన కాంగ్రెస్.. అదే జోరును కొనసాగించింది. కాంగ్రెస్‌లో తుమ్మల బలమైన నేత కావడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్ అయ్యారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో పొలిటికల్ వార్ ఆసక్తి కనబరిచింది. గతంలో తుమ్మల పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఓడితే పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యే అవకాశం లేకుంటే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో పనిచేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పి కూడా ప్రచారానికి వెళ్లారు. అదే ఆయనకు కలిసివచ్చిందని చెప్పుకోవచ్చు.
కొప్పుల ఈశ్వర్ ఓటమి
ధర్మపురిలో పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు గెలిచిన అడ్లూరి లక్ష్మణ్‌పై కొప్పుల ఈశ్వర్ అతి తక్కువ మార్జిన్ అంటే 441 ఓట్లతో విజయం సాధించారు. లక్ష్మణ్ హైకోర్టులో కేసు వేశారు.
శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ మిస్
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్ గౌడ్ ఉద్యమం
సమయంలో చురుగ్గా ఉన్నారు. అదే 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవిని తెచ్చిపెట్టింది. 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. కానీ తరచూ వివాదాల్లో ఆయనకు మైనస్ అయింది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు.
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి
నిర్మల్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి విజయం సాధించి బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. గతంలో కూడా మహేశ్వర్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. నాలుగు సార్లు విజయం సాధించిన ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి ఎదురు దెబ్బ తగిలింది. ఇంద్రకరణ్ రెడ్డి 2014లో బీఎస్పీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు.
Telangana Election Results 2023: విజయం సాధించిన 119 నియోజకవర్గాల పార్టీల శాసనసభ్యులు