NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ను ఖతం చేసేందుకు.. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పన్నాగం

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

BJP TRS Planning To Demolish Congress In Telangana Says Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి పన్నాగం పన్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లను ఈడీ ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిగినప్పుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు మాత్రం ఎందుకు మినహాయింపు? అని నిలదీశారు. కవిత ఇంటికే వెళ్లి ఎందుకు విచారణ చేయాలి? సీబీఐ ఆఫీస్‌కు ఎందుకు పిలవడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని బట్టే.. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యారన్న విషయం స్పష్టమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

ఇక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో విద్య చాలా కాస్ట్లీ అయిపోయిందని, ఎంతోమంది విద్యార్థులు తన వద్దకు సహాయం కోసం వస్తున్నారని వెంకట్‌రెడ్డి అన్నారు. కేవలం నాలుగు ఫ్లైఓవర్‌లు, రెండు రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి అయిపోదని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకొని, అదే తమ బలంగా టీఆర్ఎస్ భావిస్తోందని మండిపడ్డారు. ఇకపోతే.. కార్యకర్తలు కోరుకున్న అభ్యర్థికే టికెట్ దక్కుదుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా.. కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని చూస్తోందన్నారు.

అంతకుముందు.. డాక్టర్ అంబేద్కర్ ముందుచూపుతో దళితులు, పేదవాళ్లకు రిజర్వేషన్ కల్పించడం వల్లే పెత్తందారి వ్యవస్థ పోయిందని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వెంకట్‌రెడ్డి అన్నారు. ఇవాళ కొందరు నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారని.. కానీ, రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి దళితుడు తమ సొంతిట్లో ఉంటూ.. చదువుకోవడంతో పాటు ఉద్యోగం పొందినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.